spanish woman: కన్నతల్లిని వెదుక్కుంటూ స్పెయిన్ నుంచి ఒడిశా వచ్చిన యువతి

spanish woman returns to india in search of mother

  • కన్న తల్లి ఆచూకీ కోసం ఒడిశా వీధుల్లో తిరుగుతున్న స్పెయిన్‌ యువతి
  • సాకలేక ఇద్దరు పిల్లలను వదిలివేసి వెళ్లిపోయిన బానాలత దాస్ 
  • ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని తమతో స్పెయిన్ తీసుకువెళ్లిన గెమా వైదర్, జువాన్ జోష్ దంపతులు

చిన్నతనంలోనే కన్నతల్లికి దూరమై ఓ విదేశీ జంట సంరక్షణలో పెరిగిన ఓ యువతి పెంచిన తల్లితో కలిసి తన కన్నతల్లి ఆచూకీ తెలుసుకునేందుకు స్పెయిన్ నుంచి ఒడిశాకు చేరుకుని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. విషయంలోకి వెళితే.. ఒడిశాకు చెందిన బానాలత దాస్ నలుగురు పిల్లలతో కలిసి భువనేశ్వర్‌‌లోని నయాపల్లిలో అద్దె ఇంటిలో ఉండేవారు. ఓ ప్రైవేటు సంస్థలో వంట మనిషిగా పని చేసే ఆమె భర్త .. పిల్లలు సహా భార్యను వదిలివేసి వెళ్లిపోవడంతో ఆమెకు కుటుంబ పోషణ భారమైంది. దీంతో ఆమె తన నలుగురు పిల్లల్లో ఇద్దరు పిల్లలను (స్నేహ, సోము) ఇంటిలో వదిలివేసి, మరో ఇద్దరు పిల్లలను తన వెంట తీసుకువెళ్లింది. 

అప్పుడు స్నేహకు సుమారు ఏడాదిన్నర వయసుండగా, సోము నెలల పసిబిడ్డ. ఆ క్రమంలో ఇంటి యజమాని సమాచారంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి ఇద్దరు పిల్లలను స్థానిక అనాథ ఆశ్రమంలో చేర్పించారు. 2010 సంవత్సరంలో స్పెయిన్ నుంచి భారత్‌కు వచ్చిన గెమా వైదర్, జువాన్ జోష్ దంపతులు అనాధ ఆశ్రమంలో స్నేహ (5), సోము (4) ను దత్తత తీసుకుని వారిని తమ దేశానికి తీసుకువెళ్లి పోయారు. ఈ ఇద్దరు చిన్నారులను సొంత బిడ్డల్లా పెంచుకుని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం స్నేహ వయసు 21 ఏళ్లు కాగా, ఈ యువతి చిన్నారుల విద్యలో పరిశోధనలు చేస్తోంది.  

అయితే, ఇటీవలే వారి మూలాలు ఒడిశాలో ఉన్నాయని గెమా దంపతులు స్నేహకు తెలిపారు. దీంతో తనకు జన్మనిచ్చిన తల్లి ఆచూకీ తెలుసుకోవాలని స్నేహ తన పెంచిన తల్లి గెమాతో కలిసి గత నెల 19న భారత్ (భువనేశ్వర్)కు చేరుకుంది. స్థానిక హోటల్‌‌లో ఉంటూ నయాపల్లిలోని ఇంటి యజమాని వద్దకు వెళ్లి అక్కడ తల్లిదండ్రుల పేర్లను స్నేహ తెలుసుకుంది. ఆ తర్వాత పోలీసులు, అనాధాశ్రమంలో ఉన్న వివరాలతో వాటిని దృవీకరించుకుంది. ఈ విషయంలో స్థానిక యూనివర్శిటీకి చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు సహాయపడ్డారు. దాదాపు మూడు వారాల పాటు తల్లి బానాలత అచూకి కోసం స్నేహ ప్రయత్నించినా ఫలితం లభించలేదు. 

ఈ క్రమంలో స్థానిక పోలీస్ కమిషనర్ దృష్టికి తమ సమస్యను వివరించి సాయం చేయమని కోరగా, స్నేహ తల్లి ఆచూకి తెలుసుకునేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లకు బాధ్యతలు అప్పగించారు. పోలీసులు విచారణ చేయగా, బానాలత కటక్ లో ఉన్నట్లు గుర్తించారు. అయితే జనవరి 6న స్నేహ తిరిగి స్పెయిన్ కు వెళ్లాల్సి ఉండటంతో తల్లిని కలుసుకోవడం సాధ్యం కాలేదు. అయితే తాను మార్చిలో తిరిగి ఇండియాకు వచ్చి తల్లి ఆచూకీ కోసం ప్రయత్నాలను కొనసాగిస్తానని స్నేహ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. 

  • Loading...

More Telugu News