AB de Villiers: విరాట్ కోహ్లీకి డివిలియర్స్ కీలక సందేశం.. రీసెట్ ఫార్ములా ది బెస్ట్ అంటూ సూచన!
- బీజీటీ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన కోహ్లీ
- దీంతో టీమిండియా స్టార్ ఆటగాడిపై పెరిగిన విమర్శలు
- విరాట్‌కు మద్ధతుగా నిలిచిన ఆర్సీబీ మాజీ సహచరుడు డివిలియర్స్
- ప్రతిసారీ మన మైండ్‌ని రీసెట్ చేయడమే మంచి విషయమన్న ఏబీ
- మన బలహీనతను బలంగా మార్చుకుంటే ఎదురే ఉండదని సూచన
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని ఐదు టెస్టుల్లో కోహ్లీ తొమ్మిది ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. పెర్త్ టెస్టులో సెంచరీ మినహాయిస్తే అతడి నుంచి గొప్ప ఇన్నింగ్ మరొకటి రాలేదు.
ముఖ్యంగా ఈ సిరీస్‌లో విరాట్ ఆఫ్‌స్టంప్ అవతల పడ్డ బంతులను ఆడి ఔట్ అయ్యాడు. తద్వారా తన బలహీనతను మరోసారి బయటపెట్టుకున్నాడు. దీంతో కోహ్లీపై మాజీల నుంచి విమర్శలు పెరిగాయి. కొందరైతే ఒక అడుగు ముందుకేసి రిటైర్మెంట్ ప్రకటించడం బెటర్ అని అన్నారు.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ సహచరుడు ఏబీ డివిలియర్స్ మద్దతుగా నిలిచాడు. సోషల్ మీడియా వేదికగా కీలక సూచనతో సందేశం పంపాడు. ఆసీస్ పర్యటనలో జరిగిన విషయాలను మరిచిపోయి రీసెట్ ఫార్ములాను అనుసరించాలని కోరాడు.
"ప్రతిసారీ మన మైండ్‌ని రీసెట్ చేయడమే చాలా మంచి విషయం అని నేను అనుకుంటున్నాను. విరాట్ పోరాటాన్ని ఇష్టపడతాడు. కానీ, కొన్ని విషయాలు మన చేతుల్లో లేనప్పుడు, కొన్నింటిని వదిలించుకోవడమే ఉత్తమం. ఒక బ్యాటర్‌గా ప్రతి ఒక్కటి రీసెట్ చేయండి. ప్రతి బంతిని అర్థం చేసుకోండి. బౌలర్ గురించి మర్చిపోవాలి.
తన పోరాట పటిమ, జట్టును ఎలాగైనా గెలిపించాలనే అతని స్వభావం కారణంగా కొన్నిసార్లు విరాట్ పొరపాటు చేస్తుంటాడని నేను అనుకుంటున్నాను. జట్టు కోసం పోరాడటానికి తాను ఉన్నానని దేశం మొత్తానికి చూపించాడు. కోహ్లీ నైపుణ్యం, అనుభవం, గొప్పతనం సమస్య కాదు. కొన్నిసార్లు ప్రతి ఒక్క బంతి తర్వాత మళ్లీ దృష్టి పెట్టడం గురించి.
బహుశా కొన్నిసార్లు అతను తన బలహీనత కారణంగా ఫెయిల్ అవుతుంటాడు. కానీ, వాటన్నింటినీ మరిచిపోయి ఎంత త్వరగా ప్రతిసారీ మన మైండ్‌ని రీసెట్ చేసుకుంటే అంత మంచిది. ప్రపంచంలోని ప్రతి ఒక్క బ్యాటర్‌కు ఏదో ఒక విధమైన బలహీనత ఉంటుంది. అయితే, విరాట్ తన సమస్యను అధిగమించి తిరిగి ఫామ్‌లోకి రాగలడు" అని డివిలియర్స్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.