KTR: విచారణకు హాజరుకాకుండానే... ఏసీబీ కార్యాలయం వద్ద నుంచి వెళ్లిపోయిన కేటీఆర్

KTR returned from ACB office without attending questioning

  • ఏసీబీ కార్యాలయంలోకి కేటీఆర్ లీగల్ టీమ్ ను అనుమతించని పోలీసులు
  • 40 నిమిషాల పాటు పోలీసులకు, కేటీఆర్ కు వాగ్వాదం
  • రాజమౌళి కంటే పోలీసులు మంచి కథలను రాస్తున్నారన్న కేటీఆర్
  • ఏఎస్పీకి రాతపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చానన్న కేటీఆర్
  • ఏసీబీ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్ కు చేరుకున్న వైనం

ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-రేస్ కేసులో విచారణకు గాను ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు. తనతో పాటు లీగల్ టీమ్ ను కూడా తీసుకొచ్చారు. అయితే కేటీఆర్ ను మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని... లీగట్ టీమ్ ను అనుమతించబోమని కేటీఆర్ కు పోలీసులు స్పష్టం చేశారు. 

పోలీసులపై తనకు నమ్మకం లేదని... అందుకే లాయర్లను తనతో పాటు తీసుకెళ్తానని కేటీఆర్ చెప్పారు. అయినా పోలీసులు ఆయన లీగల్ టీమ్ ను అనుమతించేందుకు అంగీకరించలేదు. లాయర్లను అనుమతించాలని కోర్టు ఉత్తర్వుల్లో లేదని కేటీఆర్ కు పోలీసులు చెప్పారు. లాయర్లను అనుమతించకూడదనే నిబంధన ఎక్కడుందో చూపించాలని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కేటీఆర్ టీమ్ కు వాగ్వాదం నడిచింది.

ఈ క్రమంలో దాదాపు 40 నిమిషాల తర్వాత కేటీఆర్ ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లకుండా... అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏఎస్పీకి తన స్టేట్మెంట్ ను రాతపూర్వకంగా ఇచ్చానని కేటీఆర్ తెలిపారు. ఏసీబీ ఆఫీసులో ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ను రోడ్డుపై ఇచ్చానని చెప్పారు. సినీ దర్శకుడు రాజమౌళి కంటే పోలీసులు మంచి కథలను రాస్తున్నారని ఎద్దేవా చేశారు. 

అక్కడి నుంచి బయల్దేరిన కేటీఆర్ నేరుగా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు, కేటీఆర్ విచారణకు హాజరుకాకుండా వెళ్లిపోవడంతో... విచారణకు కేటీఆర్ గైర్హాజరు అయినట్టుగా పోలీసులు పరిగణిస్తారా? అనే సందేహం సర్వత్ర నెలకొంది.

  • Loading...

More Telugu News