Kota Shankar Rao: 'కోట్లమందిలో ఒక అదృష్టవంతుడు మా కోట' .. కోట శంకరరావు
- తమకి నాటకాలపై ఆసక్తి ఎక్కువన్న కోట శంకరరావు
- అన్నయ్య 15 ఏళ్లపాటు పోరాటం చేశాడని వెల్లడి
- ఆయన మహర్జాతకుడని వ్యాఖ్య
- తాను జాబ్ వదలలేకపోయానని వివరణ
కోట శ్రీనివాసరావు వెండితెరపై విలనిజాన్ని .. హాస్యాన్ని పరుగులు తీయిస్తూ ఉంటే, అటు బుల్లితెరపై అదే విలనిజాన్ని పండించిన నటుడిగా ఆయన తమ్ముడు కోట శంకరరావు కనిపిస్తారు. కొన్ని సినిమాలలో నటించిన కోట శంకరరావు తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"మా నాన్నగారికి నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువ. అందువలన మా ముగ్గురు అన్నదమ్ములం నాటకాలు వేయడానికి మా నాన్నగారు ప్రోత్సహించారు. మా పెద్దన్నయ్య నరసింహారావు సినిమాల పట్ల పెద్దగా ఆసక్తిని కనబరచలేదు. 'మనం మహా నటులం .. ఇండస్ట్రీ నుంచి వచ్చి మనలను తీసుకుని వెళ్లాలి' అనేట్టుగా ఉండేవాడు. కొంతకాలం పాటు నేను కూడా అదే అనుకున్నాను. పల్లెటూళ్లలో ఉంటూ అలా అనుకోవడం సహజమే కదా" అని అన్నారు.
" మా అన్నయ్య కోట శ్రీనివాసరావు 1970 నుంచి సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ వెళ్లాడు. 'ప్రతిఘటన' సినిమాతో ఆయన లైఫ్ టర్న్ అయింది. అంటే దాదాపు 15 ఏళ్లపాటు ఆయన పోరాటం చేశాడు. 'ప్రతిఘటన' తరువాత ఇక ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఒక రకంగా ఆ అదృష్టం కోట్ల మందిలో ఒకరిని వరిస్తుంది. ఆయన మహర్జాతకుడనే చెప్పాలి. నేను జాబ్ వదిలేసి సినిమాలలోకి వెళ్లడానికి ధైర్యం చేయలేకపోయాను. నన్ను నేను నిరూపించుకునే స్థాయి పాత్రలు కూడా నాకు ఎక్కువగా రాలేదు. అందువల్లనే నేను ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను" అని చెప్పారు.