Nara Lokesh: పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన
- ఉండిలో హైస్కూలు ఆధునికీకరించిన భవనాల ప్రారంభోత్సవం
- విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి
- సీసీ రోడ్డును ప్రారంభించిన లోకేశ్
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఉండి హైస్కూలులో ఆధునికీకరించిన భవనాలను ప్రారంభించిన మంత్రి.. కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ‘‘డ్రగ్స్ వద్దు బ్రో.. డ్రగ్స్ వైపు అసలు వెళ్ళకండి. మీరు ఇప్పుడు పదో తరగతి. బాగా చదువుకోండి. మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. మీరు బాగా చదివితే, మీ కుటుంబం కూడా బాగుపడుతుంది’’ అని చెప్పారు.
అంతకుముందు శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీఐఐసీ చైర్మన్ శివరామరాజు, టీడీపీ స్థానిక నేతలు మంత్రి లోకేశ్ కు ఉండిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం 108 ఏళ్ల చరిత్ర ఉన్న జడ్పీ హైస్కూలును మంత్రి సందర్శించారు. స్కూలు ఆవరణలో ఆధునికీకరించిన భవనాలను ప్రారంభించి, స్కూలులో సౌకర్యాలపై విద్యార్థులను ఆరా తీశారు. హైస్కూల్ నుంచి రూ.18 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.
ఆపై అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పెద అమిరం వెళ్ళి దివంగత శ్రీ రతన్ టాటా విగ్రహం ఆవిష్కరించనున్నారు. అనంతరం భీమవరం మండలం చిన అమిరం గ్రామంలోని ఎస్ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మంత్రి ప్రసంగిస్తారు. తర్వాత జువ్వలపాలెం రోడ్డులోని డిప్యూటీ స్పీకర్ శ్రీ కె.రఘురామకృష్ణరాజు నివాసంలో పార్టీ కార్యకర్తలతో మంత్రి లోకేశ్ సమావేశం, అనంతరం భీమవరంలోని నరసయ్య అగ్రహారంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నివాసానికి వెళతారని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.