KTR: బీజేపీ, కాంగ్రెస్ లకు కూడా గ్రీన్ కో ఎన్నికల బాండ్లను ఇచ్చింది: కేటీఆర్
- ఫార్ములా ఈ-కార్ రేసును నిర్వహించిన గ్రీన్ కో
- రూ. 41 కోట్లను బీఆర్ఎస్ కు చెల్లించిందన్న తెలంగాణ ప్రభుత్వం
- పార్లమెంట్ ఆమోదించిన బాండ్లను అవినీతి అని ఎలా చెబుతారన్న కేటీఆర్
ఫార్ములా ఈ-కార్ రేసును నిర్వహించిన గ్రీన్ కో సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల బాండ్ల ద్వారా రూ. 41 కోట్లను బీఆర్ఎస్ పార్టీకి చెల్లించినట్టు తెలిపింది. క్విడ్ ప్రోకోగా ఈ వ్యవహారాన్ని పేర్కొంది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ... 2022లో ఎన్నికల బాండ్లను గ్రీన్ కో ఇచ్చిందని... 2023లో ఫార్ములా ఈ-రేసు జరిగిందని చెప్పారు. ఈ కేసు కారణంగా గ్రీన్ కో నష్టపోయిందని... అందుకే ఆ మరుసటి ఏడాది స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకుందని తెలిపారు. ఇది క్విడ్ ప్రోకో ఎలా అవుతుందని ప్రశ్నించారు. పార్లమెంట్ ఆమోదించిన బాండ్లను అవినీతి అని ఎలా చెబుతారని అడిగారు. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధమని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.