Revanth Reddy: పాతబస్తీ అభివృద్ధి, మెట్రోపై మజ్లిస్ పార్టీతో చర్చిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy says will talk to MIM for development

  • ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
  • ఫ్లైఓవర్‌కు మన్మోహన్ సింగ్ పేరు
  • హైదరాబాద్ అభివృద్ధే.. తెలంగాణ అభివృద్ధి అన్న సీఎం
  • ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామన్న రేవంత్ రెడ్డి

పాతబస్తీ అభివృద్ధి, మెట్రోపై మజ్లిస్ పార్టీతో చర్చిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. ఈ మార్గంలో బెంగళూరు హైవే వరకు ఉన్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు జూపార్క్ నుంచి ఆరాంఘర్ వరకు 4.08 కిలోమీటర్ల పొడవునా ఫ్లైఓవర్ నిర్మించారు. దీనికి రూ.800 కోట్లు ఖర్చయింది. ఈ ఫ్లైఓవర్‌కు ఇటీవల మరణించిన మన్మోహన్ సింగ్ పేరును పెట్టారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... గతంలో వైఎస్సార్ హయాంలో 11.5 కిలోమీటర్ల మేర అతిపెద్ద ఫ్లైఓవర్ పీవీ ఎక్స్‌ప్రెస్ నిర్మించుకున్నామన్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించామని, ఇది నగరంలో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు.

హైదరాబాద్ నగర అభివృద్ధే... తెలంగాణ అభివృద్ధి అన్నారు. రోడ్ల విస్తరణ, మెట్రో నిర్మాణం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాల్సి ఉందన్నారు. నగర అభివృద్ధిలో భాగంగా మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆక్రమణల వల్ల హైదరాబాద్ సుందరీకరణ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కావాలని ప్రధాని నరేంద్రమోదీని అడిగామన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామన్నారు.

హైదరాబాద్ నగర అభివృద్ధికి కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ కలిసి పనిచేస్తాయన్నారు. త్వరలో మజ్లిస్ ఎమ్మెల్యేలను పిలిచి హైదరాబాద్ అభివృద్ధి, పాతబస్తీ మెట్రోపై చర్చిస్తామన్నారు. పాతబస్తీకి మెట్రో వచ్చి తీరుతుందన్నారు. హైదరాబాద్‌లో రోజురోజుకూ ట్రాఫిక్ పెరుగుతోందని, గంటల తరబడి వాహనాలు రోడ్ల మీదే ఉండటంతో కాలుష్యం పెరుగుతోందని, కోట్లాది రూపాయల ఇంధనం ఖర్చవుతోందన్నారు.

  • Loading...

More Telugu News