Anchor Shyamala: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నీతులు చెప్పడం వరకే...!: యాంకర్ శ్యామల

YCP leader Anchor Shyamala fires on Pawan Kalyan

  • గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి తిరిగి వెళుతూ ఇద్దరు అభిమానుల మృతి
  • పవన్ కనీసం వెళ్లి పరామర్శించలేదన్న శ్యామల
  • గత ప్రభుత్వంపై నెపం వేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు

ఇటీవల రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, ఈ కార్యక్రమం నుంచి తిరిగి వెళుతూ ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. గత ప్రభుత్వం కాకినాడ-రాజమండ్రి ఏడీబీ రోడ్డును పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పవన్ ఆరోపించారు. 

దీనిపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నీతులు చెప్పడం వరకేనని, ఆచరణ ఉండదని విమర్శించారు. గేమ్ చేంజర్ మెగా ఈవెంట్ కు హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని, నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని శ్యామల ఆరోపించారు. 

"కాకినాడ-రాజమండ్రి ఏడీబీ రోడ్డు ఛిద్రమైన స్థితిలో ఉందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్ కు మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు సర్? సీజ్ ద రోడ్ (SEIZE THE ROAD) అనాలి కదా! సినిమాలకు రండి, చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగులు చేయండి, ఈలలు వేసి గోల చేయండి అంటూ యువతను రెచ్చగొడుతూ మీరు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా? 

మీ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే కనీసం వెళ్లి పరామర్శించారా?... అంటే, మీ స్వార్థానికి అమాయకుల ప్రాణాలు బలి చేస్తున్నారా?" అంటూ శ్యామల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News