Chandrababu: ఏ అభివృద్ధి కార్యక్రమమైనా కుప్పంలో ప్రయోగించాకే రాష్ట్రంలో అమలు చేస్తాం: చంద్రబాబు

Chandrababu on Surya Ghar yojna

  • పీఎం సూర్య ఘర్ కింద కుప్పంలో ప్రతి ఇంటికి సౌర పలకలు ఏర్పాటు చేస్తామన్న సీఎం
  • కుప్పంను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ప్రతి ఇంటికి సోలార్ ప్యానల్స్ అమర్చుతామని వెల్లడి
  • ఇప్పుడు మన ఇంటి పైనే విద్యుత్ తయారవుతోందన్న చంద్రబాబు

రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా మొదట కుప్పంలో ప్రయోగించాకే రాష్ట్రమంతటా అమలు చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నడిమూరు గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పీఎం సూర్య ఘర్ కింద నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వంద శాతం రాయితీతో సౌర పలకలు ఏర్పాటు చేసి విద్యుత్ అందించడమే అందించడమే తన లక్ష్యం అన్నారు. కుప్పంను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రతి ఇంటికీ సోలార్ ప్యానల్స్ అమర్చుతామన్నారు.

మన ఇంటి పైనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. తన చిన్నప్పటి రోజుల్లో కరెంటు సరిగా ఉండేది కాదని గుర్తు చేసుకున్నారు. లాంతర్ల దగ్గర చదువుకునేవాళ్లమన్నారు. కరెంట్ ఎక్కడో తయారవుతుందని, కానీ సౌర పలకల ద్వారా మన ఇంటి పైనే విద్యుత్ తయారవుతుందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకు వారి ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. తాను సోలార్, విండ్ పవర్‌కు అధిక ప్రాధాన్యతను ఇచ్చానని... వీటి వల్ల కరెంటు ఉత్పత్తి చేస్తే  చార్జీలు తగ్గుతాయన్నారు.

మన ఇంటిపైనే విద్యుత్ తయారీ

సూర్యఘర్ ద్వారా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి రెండు కిలో వాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకునేందుకు సబ్సిడీ వస్తుందని తెలిపారు. ఒక్కో కిలో వాట్ కు రూ.30 వేలు చొప్పున రూ.60 వేలు ఇస్తారని, అయితే రెండు కిలో వాట్స్ కరెంటు ఉత్పత్తికి రూ.1 లక్షా 10 వేలు ఖర్చవుతుందన్నారు. దీనివల్ల నెలకు 200 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు. 60 యూనిట్లు కరెంటు వాడితే రూ.200 నుంచి 300 బిల్లు కడుతున్నారని... మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకోగలిగితే 60 యూనిట్లు వాడుకుని మిగిలిన 140 యూనిట్లు గ్రిడ్‌కు ఇవ్వవచ్చని... అలా నాలుగైదు ఏళ్లు ఉత్పత్తి చేసిన కరెంటును గ్రిడ్‌కు ఇస్తే మీరు వాడుకున్న కరెంటు ఉచితంతో పాటు, ఐదేళ్ల తర్వాత ఆ ప్యానెళ్లు  సొంతమవుతాయన్నారు. పైగా ఏడాదికి రూ.5 వేల వరకూ ఆదాయం వస్తుందని చెప్పారు. ఖర్చు లేకుండా ప్యానెల్స్ పెట్టడంతో పాటు నిర్వహణ బాధ్యతలు కూడా డిపార్ట్‌మెంట్ తీసుకుంటుందని, సోలార్‌తో విద్యుత్ ఉత్పత్తి వల్ల ఇళ్లకు, వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇవ్వవచ్చన్నారు.

కాలుష్య కోరల్లో చిక్కుకున్నాం

క్యాన్సర్ వంటి రోగాలకు కాలుష్యమే కారణమని, మనం తినే తిండి, పీల్చే గాలి మొత్తం కాలుష్యమే అన్నారు. ఎరువులతో పండించిన పంట తిని మనం రోగాలబారిన పడుతున్నామని తెలిపారు. పొల్యూషన్ లేకపోతే 100 ఏళ్లు జీవించవచ్చని వ్యాఖ్యానించారు. ఇళ్ల చుట్టూ చెత్తాచెదారం వేయడంతో రోగాల బారిన పడుతున్నామన్నారు. చెట్లను పెంచాలని, ఆ గాలి పీల్చితే మీ ఆరోగ్యం బాగుంటుందని సూచించారు. మన కుప్పం నియోజకవర్గంలో కొన్ని చోట్ల 1200 అడుగుల లోపల నీరు ఉందని, వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి హంద్రీనీవా పూర్తి చేసి కృష్ణా జలాలు కుప్పం నియోజక వర్గానికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో కుప్పం మొత్తం ఎలక్ట్రికల్ సైకిల్స్ రాబోతున్నాయన్నారు. కుప్పం నియోజకవర్గంలో పెట్రోల్ బంకుల మాదిరి చార్జింగ్ స్టేషన్లు పెడతామని చెప్పారు.

ఐదేళ్లలో కుప్పంలో అరాచకం సృష్టించారు

ప్రశాంతతకు మారుపేరైన కుప్పం నియోజకవర్గంలో గత ఐదేళ్లలో విధ్వంసాలు సృష్టించి, ప్రజలను ఇబ్బందులపాలు చేశారని సీఎం మండిపడ్డారు. ఇష్టానుసారంగా ఎవరైనా తోకలు జాడిస్తే కట్ చేస్తానని హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.

  • Loading...

More Telugu News