Team India: ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్.. జట్టులోకి తిరిగి ఆ ముగ్గురు!

BCCI Soon Announce Indian Team For Champions Trophy

  • ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్
  • త్వరలోనే చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన
  • ఇంగ్లండ్‌తో సిరీస్‌కు బుమ్రా దూరం
  • చాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్‌గా బుమ్రా!

ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో దారుణ పరాభవం ఎదుర్కొన్న భారత జట్టు త్వరలో సొంతగడ్డపై ఇంగ్లండ్ జట్టుతో టీ20, వన్డే సిరీస్‌లో తలపడనుంది. ఈ నెల 22 నుంచి టీ20 సిరీస్, ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతాయి. ఇక, చాంపియన్స్ ట్రోఫీకి నేడో, రేపో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జట్టును ఇంగ్లండ్‌పైనా ఆడించే అవకాశం ఉంది. చాంపియన్స్ ట్రోఫీకి ఈ నెల 12 లోపు ప్రొవిజనల్ జట్లను ప్రకటించాల్సి ఉంటుంది. వచ్చే నెల 13 వరకు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. 

ఈ క్రమంలో కొన్ని నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, అర్షదీప్ సింగ్‌లకు చాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వీరు విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. ఇక, ఇంగ్లండ్‌తో సిరీస్‌కు స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్టు తెలిసింది. నాలుగు నెలల వ్యవధిలో అతడు ఏకంగా 10 టెస్టులు ఆడటం, ఇటీవల ముగిసిన మెల్‌బోర్న్ టెస్టులో 53.2 ఓవర్లు బౌలింగ్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంతేకాదు, ఆసీస్ పర్యటనలో బుమ్రా మొత్తం 151.2 ఓవర్లు వేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు బుమ్రా అందుబాటులో లేకున్నా, చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాడని చెబుతున్నారు. అంతేకాదు, చాంపియన్స్ ట్రోఫీలో అతడు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News