ICC Rankings: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఓటమి ఎఫెక్ట్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దిగజారిన టీమిండియా
- ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మూడవ స్థానానికి దిగజారిన భారత్
- రెండవ స్థానానికి ఎగబాకిన దక్షిణాఫ్రికా జట్టు
- నంబర్ 1 స్థానాన్ని మరింత పదిలం చేసుకున్న ఆస్ట్రేలియా
చెత్త ప్రదర్శనతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో 1-3 తేడాతో ఓటమి పాలైన టీమిండియా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 3వ స్థానానికి దిగజారింది. భారత్ ఆడిన చివరి 8 టెస్టు మ్యాచ్‌ల్లో ఏకంగా ఆరింటిలో ఓటమిపాలవ్వడం ఇందుకు ప్రధాన కారణమైంది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో కూడా టీమిండియా ఘోర పరాభవాన్ని చవిచూసింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత తొలిసారి స్వదేశంలో ఒక టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్‌కు గురైంది. 3-0 తేడాతో సిరీస్‌లో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ పరాజయాలు భారత ర్యాంకింగ్ దిగజారడానికి కారణాలయ్యాయి.
ఇదే సమయంలో, దక్షిణాఫ్రికా జట్టు వరుసగా ఏడు టెస్టు మ్యాచ్ విజయాలు సాధించడంతో ఆ జట్టు ర్యాంక్ మెరుగుపడడానికి దోహదపడింది. 112 రేటింగ్ పాయింట్లతో సఫారీ జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకింది. భారత్ 109 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి దిగజారింది. 126 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకుంది. 106 పాయింట్లతో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో, 96 పాయింట్లతో న్యూజిలాండ్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి. 87 పాయింట్లతో శ్రీలంక ఆరో స్థానంలో ఉంది. పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ ఆ తర్వాతి వరుస స్థానాల్లో నిలిచాయి.