Donald Trump: కెనడాను అమెరికాలో విలీనం చేసుకుంటాం.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట!
- యూఎస్ లో కెనడాను 51వ రాష్ట్రంగా చేస్తామన్న ట్రంప్
- అమెరికాలో విలీనం కావడాన్ని కెనడా ప్రజలు ఇష్టపడుతున్నారని వ్యాఖ్య
- అమెరికాలో విలీనమైతే పన్నులు తగ్గుతాయన్న ట్రంప్
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కెనడాను అమెరికాలో విలీనం చేస్తామని... యూఎస్ లో 51వ రాష్ట్రంగా చేస్తామని చెప్పారు. చాలా మంది కెనడా ప్రజలు అమెరికాలో విలీనం కావడాన్ని ఇష్టపడుతున్నారని అన్నారు.
కెనడా వాణిజ్య లోటును, రాయితీలను ఇకపై అమెరికా భరించదు అని తెలిసే జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేశారని ట్రంప్ చెప్పారు. అమెరికాలో కెనడా విలీనమైతే పన్నులు తగ్గుతాయని తెలిపారు. చైనా, రష్యా షిప్ ల నుంచి కెనడాకు ముప్పు ఉందని... అమెరికాలో విలీనమైతే రక్షణ లభిస్తుందని చెప్పారు.
ఇదిలా ఉంచితే, జస్టిన్ ట్రూడోపై కొంత కాలంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో, ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు నిన్న ప్రకటించారు. పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ప్రధానిగా కొనసాగుతానని చెప్పారు. తొలిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు ట్రూడోతో ట్రంప్ కు మంచి సంబంధాలు ఉండేవి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రూడోను ట్రంప్ కలిసిన తర్వాత నుంచి కెనడాను అమెరికాలో కలుపుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు.