YS Sharmila: ఆరోగ్యశ్రీని వదిలించుకునే ప్రయత్నం జరుగుతోంది: షర్మిల

An attempt is being made to get rid of Arogyashri says YS Sharmila
  • ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని షర్మిల విమర్శ
  • ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారని మండిపాటు
  • పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్
అరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చేసిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ అని ఆమె చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి మానస పుత్రిక ఈ పథకమని అన్నారు. ప్రాణాలు తీసే జబ్బొచ్చినా సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని... కూటమి సర్కార్ నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు.

రూ. 3 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా, వైద్య సేవలు నిలిచే దాకా చూడటం అంటే... పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రగానే దీన్ని చూడాలని షర్మిల అన్నారు. ఆరోగ్య శ్రీ పథకానికి మంగళం పాడి... ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించారు. ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కత్తిపీట వేస్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ... వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

"ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఆరోగ్య శ్రీ పథకానికి బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినవే అయినా... వాటిని చెల్లించే బాధ్యత మీ ప్రభుత్వంపైనే ఉంది. వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవండి. పెండింగ్ బకాయిలు రూ. 3 వేల కోట్లు తక్షణం విడుదల చేయండి. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించి, పథకానికి ఏ లోటూ రాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం" అని షర్మిల చెప్పారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు.
YS Sharmila
Congress
Aarogyasri

More Telugu News