Sugar Prices: చేదెక్కనున్న పంచదార.. త్వరలోనే ధరలు పెరుగుదల!
- చక్కెర కనీస విక్రయ ధర పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్న కేంద్ర ప్రభుత్వం
- వెల్లడించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
- నేరుగా వినియోగదారులను ప్రభావితం చేయనున్న ధరల పెంపు
దేశంలో పంచదార వినియోగదారుల బడ్జెట్‌పై త్వరలోనే స్వల్ప భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. చక్కెర కనీస విక్రయ ధరను పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 2019 ఫిబ్రవరి నుంచి కేజీ పంచదార కనీస విక్రయ ధర రూ. 31గానే ఉంది. కనీస విక్రయ ధరను పెంచాలంటూ ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్న నేపథ్యంలో ధర పెంపుపై కేంద్ర ప్రభుత్వం త్వరలోకే నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ప్రకటించారు.
పంచదార ధరలను పెంచాలంటూ చక్కెర పరిశ్రమ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని కంపెనీల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. కంపెనీల మనుగడ, తిరిగి లాభాలు పొందాలంటే ధరను పెంచడం మినహా వేరే మార్గం లేదని చక్కెర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వీరి సమస్యను కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. అందుకే, సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పీయూష్ గోయల్ ఈ కీలక ప్రకటన చేశారు. ధర పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
పంచదార కనీస విక్రయ ధరను పెంచితే సామాన్యులపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కనీస విక్రయ ధరను రూ.39.40కు కానీ, రూ.42కి కానీ పెంచాలని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ వంటి పరిశ్రమ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే జరిగితే తదనుగుణంగా బహిరంగ మార్కెట్‌లో కూడా ధరలు పెరుగుతాయి.