south africa: పాకిస్థాన్ కూడా ఓడిపోయింది!
- వరుస విజయాలతో దూసుకెళ్తున్న దక్షిణాఫ్రికా జట్టు
- పాక్ తో జరిగిన రెండో టెస్టులోనూ ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా
- డబుల్ సెంచరీతో అదరగొట్టిన రికెల్టన్ (259)
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో రెండో మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వరుస విజయాలతో దూసుకువెళ్తున్న దక్షిణాఫ్రికా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ (ఫాలోఅన్)లో 213/1 స్కోరుతో సోమవారం నాడు నాలుగో రోజు ఆటను ప్రారంభించిన పాక్ .. 478 పరుగులకు ఆలౌట్ అయింది. షాన్ మసూద్ (145), బాబర్ అజామ్ (81), మహ్మద్ రిజ్వాన్ (41), సల్మాన్ ఆఘా (48), అమీర్ జమాల్ (34) రన్స్ చేశారు.
ఈ క్రమంలో పాక్ నిర్దేశించిన 58 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు 7.1 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించారు. డేవిడ్ బెడింగ్ హామ్ (44), మార్ క్రమ్ (14) రన్స్ చేశారు. తొలి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా జట్టు 615 రన్స్ చేసి ఆలౌటైంది. రికెల్ టన్ (259) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. తెంబా బావుమా (106), కైల్ వెరిన్ (100) సెంచరీ చేశారు. మార్కో యాన్సెన్ (62), కేశవ్ మహరాజ్ (40) రన్స్ చేశారు.