VC Sajjanar: ఆశ పడొచ్చు తప్పులేదు, కానీ అత్యాశ పనికిరాదు.. వీడియో షేర్ చేసిన సజ్జనార్
- రూ. వెయ్యి పెట్టుబడితో చిటికెలో లక్ష రాబడి అంటే నమ్మొద్దని హెచ్చరిక
- ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలో పడొద్దని హితవు
- చేతులు కాలాక ఆకులు పట్టుకునే కన్నా ముందే జాగ్రత్తపడాలని సూచన
డబ్బు సంపాదించడం చాలా ఈజీ.. ఇంట్లో కూర్చుని ఆడుతూ పాడుతూ లక్షల్లో సంపాదించండి అంటూ వచ్చే ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ఐపీఎస్ ఆఫీసర్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఆశ పడడంలో తప్పులేదు కానీ అత్యాశ పనికిరాదని వార్నింగ్ ఇచ్చారు. రూ. వెయ్యి పెట్టుబడి పెట్టి చిటికెలో రూ.లక్ష సంపాదించుకోవచ్చని చెబుతున్న ఈ వీడియో పూర్తిగా అబద్ధమని చెప్పారు. 99 రెట్లు లాభం వస్తుందని చెబితే నమ్మి మోసపోవద్దని అన్నారు.
ఇలాంటి వీడియోలతో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లు విసిరే వలలో చిక్కుకోవద్దని హితవు పలికారు. వీడియోలో చూపించిన నోట్ల కట్టలు చూసి అత్యాశకు పోవద్దన్నారు. ఇలాంటి మాయగాళ్ల మాటలు నమ్మి ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలో పడి జీవితాలను ఛిద్రం చేసుకోకండంటూ సజ్జనార్ హితవు పలికారు. అత్యాశకు పోతే చివరికి బాధ, దుఃఖమే మిగులుతాయనే సత్యం గుర్తించాలని చెప్పారు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే కన్నా ముందే జాగ్రత్తగా ఉండటం ఉత్తమమని వివరించారు. నోట్ల కట్టలతో అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి ఆన్ లైన్ బెట్టింగ్ మాయగాళ్ల గురించి మీకు తెలిస్తే వెంటనే మీ సమీపంలోని పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు.