Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి వైస్ కెప్టెన్‌గా స్టార్ క్రికెటర్!
- స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు!
- బీసీసీఐ సెలక్టర్లు యోచిస్తున్నట్టుగా కథనాలు
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన బుమ్రా
- రెండు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గానూ రాణించి ఆకట్టుకున్న స్టార్ పేసర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. పాకిస్థాన్, దుబాయ్ వేదికగా వచ్చే నెలలో ఈ మెగా టోర్నీ జరగనుంది. భారత జట్టుని బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరికొన్ని రోజుల్లోనే ప్రకటించనుంది. జట్టు సారథిగా రోహిత్ శర్మ ఖరారైనట్టు కథనాలు వెలువడుతున్నాయి. అయితే, వైఎస్ కెప్టెన్‌గా ఎవర్ని ఎంపిక చేస్తారనే ఉత్కంఠ క్రికెట్ వర్గాల్లో నెలకొంది.
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి గాయం నుంచి కోలుకుంటే వైస్ కెప్టెన్‌గా సెలక్టర్లు ఎంపిక చేస్తారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. పరిమితి ఓవర్ల క్రికెట్లో వైస్ కెప్టెన్‌గా బుమ్రాను పరిగణనలోకి తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ కావడంతో ఈ తాజా కథనం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ హయాంలో వన్డే, టీ20 జట్లకు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించేవాడు. కొన్నిసార్లు కేఎల్ రాహుల్ కూడా ఆ బాధ్యతలు నిర్వహించాడు. అయితే, కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాక వన్డేలు, టీ20లలో వైస్ కెప్టెన్ బాధ్యతలను శుభ్‌మాన్ గిల్‌కు అప్పగిస్తున్నారు. అయితే, ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుత వ్యక్తిగత ప్రదర్శనతో పాటు రెండు మ్యాచ్‌లకు కెప్టెన్‌గానూ వ్యవహరించి రాణించిన బుమ్రాకు ఛాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని సెలక్టర్లు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో భారత్ గెలిచిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు అతడే సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో గాయపడ్డ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులోకి రావడం దాదాపు ఖాయమే. ఆ సమయానికి కోలుకోనున్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు అందుబాటులోకి రావడంపై ఇంకా స్పష్టత రాలేదు.