Surya: పెద్ద హీరో... చిన్న విలన్... మరో రిస్క్ చేస్తున్న సూర్య!
- 'కంగువా'తో ఫ్లాప్ చూసిన సూర్య
- నెక్స్ట్ మూవీతో హిట్ కొట్టాలంటున్న ఫ్యాన్స్
- ఆర్ జె బాలాజీతో సెట్స్ పైకి వెళ్లిన సూర్య
- ఆర్ జె బాలాజీనే విలన్ అంటూ టాక్
సూర్య కథానాయకుడిగా ఇటీవలే 'కంగువా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైటిల్ తోను... సూర్య లుక్ తోను అందరిలో ఆసక్తిని పెంచుతూ వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతమాత్రం మెప్పించలేకపోయింది. వినోదప్రధానమైన అంశాలకు దూరంగా వెళ్లిన ఈ సినిమా, నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే సూర్య మాత్రం ఈ విషయాన్ని లైట్ తీసుకున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టును చేసుకుంటూ వెళుతున్నాడు.
'కంగువా' సినిమా రిజల్ట్ తరువాత సూర్య, తన నెక్ట్స్ ప్రాజెక్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఖాయమనే ఒక టాక్ వచ్చింది. అయితే సూర్య ఈ ప్రాజెక్టు విషయంలో కూడా చాలా రిస్క్ తీసుకుంటూ ఉండటం ఆశ్చర్యం. సూర్య తాజా చిత్రం ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. రెండో షెడ్యూల్ కి సంబంధించిన చిత్రీకరణకిగాను, చెన్నై లో ప్రత్యేకమైన సెట్లు వేస్తున్నారు. ఈ నెలంతా ఇక్కడే షూటింగు జరుగుతుందని అంటున్నారు.
సాధారణంగా 'కంగువా' ఫ్లాప్ తరువాత పెద్ద డైరెక్టర్ తో సెట్స్ పైకి వెళ్లాలనే ఏ హీరో అయినా అనుకుంటాడు. కానీ ఇంతవరకూ స్టార్స్ తో సినిమా చేయని ఆర్ జె బాలాజీ దర్శకత్వంలో సూర్య ముందుకు వెళ్లడం విశేషం. ఇక ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నది కూడా ఆర్ జె బాలాజీనే. అతను నటుడు కూడా అనే విషయం తెలిసిందే. హీరో - విలన్ ఇద్దరూ లాయర్లు కావడం మరో విశేషం. మరి ఈ సినిమాతో అభిమానులు ఆశించే హిట్ ను సూర్య ఎంతవరకూ ఇస్తాడనేది చూడాలి.