Rajinikanth: రిపోర్టర్‌పై రజనీకాంత్ అసహనం.. అలాంటి ప్రశ్నలు వేయొద్దంటూ సూపర్ స్టార్ ఆగ్రహం!
- రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో 'కూలీ'
- ఈ మూవీ తదుపరి షెడ్యూల్ కోసం థాయిలాండ్ పయనమైన రజనీ
- ఎయిర్‌పోర్టులో మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్న సూపర్ స్టార్
- ఈ క్రమంలో ఆయన్ను సమాజంలో మహిళల భద్రతపై ప్రశ్న అడిగిన ఓ విలేకరి
- రాజకీయ సంబంధిత ప్రశ్నలు అడగొద్దంటూ రజనీకాంత్ అసహనం
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కూలీ'. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం థాయిలాండ్ వెళుతున్న రజనీ.. విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 'కూలీ' సినిమా విశేషాలను ఆయన పంచుకున్నారు. అయితే, ఓ రిపోర్టర్ సూపర్ స్టార్‌కు సమాజంలో మహిళల భద్రత గురించి ప్రశ్న వేశారు.
దాంతో ఆ రిపోర్టర్‌పై ఇలాంటి అసంబద్ధమైన ప్రశ్నలు వేయొద్దని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు తనను అడగొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనను దృష్టిలో ఉంచుకుని విలేకరి... రజనీకాంత్‌కు మహిళల భద్రతపై ప్రశ్నించారు. దాంతో తనను పాలిటిక్స్ సంబంధిత ప్రశ్నలు వేయొద్దని సూపర్ స్టార్ ఘాటుగా స్పందించారు.
కాగా, తన 'కూలీ' చిత్రం విశేషాలను పంచుకున్న రజనీ.. ఈ సినిమా దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 13 నుంచి 28 వరకు మరో షెడ్యూల్ జరగనుందన్నారు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో రజనీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్, సౌబిన్ షాహిర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ బాణీలు అందిస్తున్నాడు. 'లియో' తర్వాత లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న 'కూలీ' చిత్రం సూపర్ స్టార్ కెరీర్‌లో 171వ సినిమా. ఈ చిత్రం తర్వాత రజనీ.. 'జైలర్2' ప్రాజెక్టులో జాయిన్ అవుతారని సమాచారం. ఇటీవల వరుస ప్లాపులతో డీలా పడ్డ రజనీకాంత్‌కు 'జైలర్' మూవీ సూపర్ హిట్‌ను అందించిన విషయం తెలిసిందే.