Chamala Kiran Kumar Reddy: రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయిన యాంకర్... నిప్పులు చెరిగిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
- తెలుగు మహాసభలు పెట్టిన వారికి బుద్ధి లేదా? యాంకర్‌కు చదువు రాదా? అని ఆగ్రహం
- ముఖ్యమంత్రులు ఎవరో తెలియకుండానే యాంకర్ అవుతాడా? అని మండిపాటు
- రేవంత్ రెడ్డి పేరు పలకపోవడం వెనుక కుట్ర దాగి ఉందన్న ఎంపీ
తెలుగు మహాసభల్లో యాంకర్ ముఖ్యమంత్రి పేరు మరిచిపోవడంపై కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం పేరు చెప్పకపోవడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని తనకు అనిపిస్తోందన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలుగు మహాసభలు పెట్టింది ఎవరు? సభలు పెట్టిన వారికి బుద్ధి లేదా? యాంకర్ అనేవాడికి చదువు రాదా? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరో తెలియకుండా యాంకర్ ఎలా అయ్యాడు? అని భగ్గుమన్నారు.
మనం చిన్న చిన్న విషయాలు జరిగినప్పుడే కాగితం దగ్గర పెట్టుకొని మాట్లాడతామన్నారు. నేను ఓ ఎంపీగా ఉండి కూడా కాగితం దగ్గర పెట్టుకొని మాట్లాడతున్నానన్నారు. ఓ ముఖ్యమంత్రి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చారు... ఆయన పేరు ఏమిటో తెలియకుండానే పేరు చదువుతాడా? అని నిలదీశారు. దీని వెనుక కుట్ర ఉన్నట్లుగా ఉందన్నారు.
ఏం జరిగింది?
ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తూ ఓ యాంకర్ పేరును తప్పుగా పలికాడు. "మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు..." అంటూ యాంకర్ ఆహ్వానం పలికారు. అయితే ఆ తర్వాత ఎవరో చెప్పడంతో తన తప్పును సరిదిద్దుకున్నారు. "క్షమించాలి, మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు" అంటూ సరిదిద్దుకున్నారు. సీఎం పేరును మరిచిపోవడంపై చామల కిరణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.