Special Buses: సంక్రాంతికి స్పెషల్ బస్సుల సంఖ్యను మరింత పెంచిన ఏపీఎస్ఆర్టీసీ
- తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి
- 7,200 స్పెషల్ బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ
- ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని వెల్లడి
- అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం ఉంటుందని వివరణ
సంక్రాంతి సీజన్ వస్తోందంటే తెలుగు రాష్ట్రాల్లో హడావిడి మామూలుగా ఉండదు. ప్రయాణాలు ఊపందుకుంటాయి. ఇటు ఏపీ, అటు తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీలు వేల సంఖ్యలో అదనపు బస్సులు వేసినా, ప్రయాణికుల రద్దీ ఏమాత్రం తగ్గదు. ఈ నేపథ్యంలో, ఏపీఎస్ఆర్టీసీ ఈ సంక్రాంతికి బస్సుల సంఖ్యను మరింత పెంచింది. 7,200 స్పెషల్ బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.
తెలంగాణ, ఇతర పొరుగు రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో స్పెషల్ బస్సులు నడపనున్నారు. సంక్రాంతి స్పెషల్ బస్సులు జనవరి 8 నుంచి 13వ తేదీవరకు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది.
హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు 2,153 బస్సులు, బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు 375 బస్సులు, విజయవాడ నుంచి 300 అదనపు బస్సులు నడపనున్నారు. ఇక తిరుగు ప్రయాణానికి ఈ నెల 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఒకేసారి రానుపోను టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ లభిస్తుందని వెల్లడించింది. ఈ స్పెషల్ బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యం ఉంటుందని తెలిపింది.