Ram Gopal Varma: 'కేజీఎఫ్' చెడ్డవాళ్ల సినిమా .. ఎందుకంటే.. : రాంగోపాల్ వర్మ
- 'శివ' సినిమాలో రక్తపాతం లేదన్న వర్మ
- సినిమా ఆడటానికి బడ్జెట్ తో సంబంధం లేదని వెల్లడి
- సినిమా ఫ్లాప్ అయినా అందరూ నష్టపోరని వ్యాఖ్య
- బేసిగ్గా మంచి సినిమాలు బోర్ కొడతాయని వివరణ
రాంగోపాల్ వర్మ .. 'శివ' సినిమాతో తెలుగు సినిమా ట్రెండ్ ను మార్చేసిన దర్శకుడు. ఆ తరువాత ఆయన నుంచి ఎన్నో హిట్స్ వచ్చాయి. దెయ్యం సినిమాలు .. గ్యాంగ్ స్టర్ సినిమాలతోను ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. తన సినిమాలలోని కొన్ని హైలైట్ సీన్స్ ను గురించి .. ఈ మధ్య కాలంలో సినిమా నిర్మాణంలో వస్తున్న మార్పులను గురించిన విషయాలను ఆయన 'బిగ్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు.
'శివ' సినిమాలో యాక్షన్ ఉంటుంది .. కానీ రక్తపాతం ఉండదు. ఈ మధ్య కాలంలో మాత్రం తెరపై రక్తపాతం పెరిగిపోతుందనేది వాస్తవమే. హీరోను క్రిమినల్ గా చూపించడమనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. అలాంటి సినిమాలు అమితాబ్ చాలానే చేశారు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే, బడ్జెట్ కీ .. సినిమా బాగా ఆడటానికి సంబంధం లేదు. కంటెంట్ బాగుంటే అది చిన్న సినిమా అయినా ప్రేక్షకులు చూస్తారు" అన్నారు.
" తమ సినిమా ద్వారా ఎంత వెనక్కి రావొచ్చు అనే ఒక నమ్మకంతోనే నిర్మాత ఖర్చు చేస్తాడు. ఒకవేళ అనుకున్నంత వెనక్కి రాకపోతే, నిర్మాత నష్టపోయినా .. ఆ సినిమాకి పనిచేసిన వాళ్లందరి జేబుల్లోకి ఆ డబ్బు వెళ్లిందనే నేను అనుకుంటాను. బంగారం స్మగ్లింగ్ చేసే హీరో కారణంగా 'కేజీఎఫ్' .. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన కారణంగా 'పుష్ప 2' హిట్ అంటే నేను అంగీకరించను. మంచి సినిమాలు ఆడని సందర్భాలు మాత్రం ఉన్నాయి.
"మంచి సినిమా తీసినా ఎందుకు ఆడలేదని బాధపడుతున్న ఒక పర్సన్ తో నేను ఒక మాట చెప్పాను. 'మంచి సినిమా వేరు .. మంచివాళ్ల సినిమా వేరు' అన్నాను. 'కేజీఎఫ్' మంచివాళ్ల సినిమా కాదు .. చెడ్డవాళ్ల సినిమా. కానీ మంచి సినిమా .. ఎందుకంటే హిట్ అయింది కాబట్టి. మంచి సినిమా చూడటమనేది బేసిగ్గా బోర్ కొడుతుంది. థంబ్ నేల్ తిడుతూ ఉంటే ఎవరైనా చూస్తారుగానీ, పొగుడుతూ ఉంటే ఎవరు చూస్తారు?" అంటూ నవ్వేశారు.