Chandrababu: చంద్రబాబు భద్రత మరింత కట్టుదిట్టం.. అదనంగా కమెండోలతో కౌంటర్ యాక్షన్ టీమ్
- ఇప్పటికే చంద్రబాబుకు ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ, స్థానిక బలగాలతో భద్రత
- విదేశాల్లో శిక్షణ పొందిన కమెండోలతో భద్రత పెంపు
- దాడి చేసిన వారిని తుదముట్టించడమే ఈ కమెండోల లక్ష్యం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత మరింత కట్టుదిట్టమయింది. ఆయన భద్రతావలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాలు వచ్చాయి. ఆయన భద్రతలో ఉండే ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమెండోలతో కౌంటర్ యాక్షన్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్ కు ఎస్పీజీ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ఆయన భద్రతను కట్టుదిట్టం చేశారు. మన దేశంలో బ్లాక్ క్యాట్ కమెండోలు, ఎన్ఎస్జీ సెక్యూరిటీ కలిగిన అతికొద్ది మంది వ్యక్తుల్లో చంద్రబాబు ఒకరు.
చంద్రబాబు భద్రతలో మూడు వలయాలు ఉంటాయి. తొలి వలయంలో ఎన్ఎస్జీ, రెండో వలయంలో ఎస్ఎస్జీ, మూడో వలయంలో దూరంగా ఆరుగురు కౌంటర్ యాక్షన్ కమెండోలు ఉంటారు. ఏదైనా జరిగితే ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ బృందాలు చంద్రబాబును వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. కౌంటర్ యాక్షన్ టీమ్ మాత్రం దాడికి వచ్చిన వారిని వదలకుండా, వారిని తుదముట్టిస్తుంది. ఈ మేరకు వారికి శిక్షణ ఇచ్చారు. విదేశాలతో పాటు, దేశంలో వివిధ అత్యుత్తమ శిక్షణ ఇచ్చే కేంద్రాలలో వీరికి శిక్షణ ఇప్పించారు. నిన్నటి నుంచి వీరు అధికారికంగా చంద్రబాబు భద్రతావలయంలో చేరారు.