Harish Rao: అక్రమ కేసులు పెట్టి కేటీఆర్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు: హరీశ్ రావు

Harish Rao blames Revanth Reddy for not fullfilling promises

  • రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో కోతలు, ఎగవేతలు... కాదంటే కేసులు అని విమర్శ
  • సమస్యలపై దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసులు పెట్టారని మండిపాటు
  • ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్న హరీశ్ రావు

కేటీఆర్ మీద అక్రమ కేసు పెట్టి అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ డైరీని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో కోతలు, ఎగవేతలు... కాదంటే కేసులు మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టి ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

దృష్టి మళ్లింపు తప్ప ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒక్కసారి రైతు భరోసా ఇచ్చి మళ్లీ ఎగ్గొడతారని విమర్శించారు. ఢిల్లీకి కమీషన్లు పంపించేందుకు డబ్బులు ఉన్నాయి కానీ ప్రజల పథకాల కోసం లేవా? అని నిలదీశారు. అవినీతి పాలనను ప్రశ్నించినందుకే కేటీఆర్‌పై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువస్తే... వాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోతలు పెట్టిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన వాటిని కూడా ఎగవేస్తున్నారు. ప్రశ్నించే వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి మించి రేవంత్ రెడ్డి సాధించిందేమీ లేదన్నారు. పథకాలు ఎగ్గొట్టినందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాదు... ఎగవేతల రేవంత్ రెడ్డి అని తాను అన్నందుకు తనపై మానకొండూరులో కేసు పెట్టారని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్‌కు రమ్మని తనకు నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయన్నారు.

  • Loading...

More Telugu News