MK Stalin: ఆ అత్యాచార నిందితుడు మా మద్దతుదారుడే: తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
- పార్టీ మద్దతుదారుడే కానీ క్రియాశీలక సభ్యుడు కాదన్న స్టాలిన్
- తమకు మహిళల భద్రతే ముఖ్యమన్న ఎంకే స్టాలిన్
- కేసు నమోదైన కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడి
చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన కీలక నిందితుడు తమ మద్దతుదారుడేనని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. ఆ నిందితుడు తమ మద్దతుదారు అని, కానీ పార్టీలో క్రియాశీలక సభ్యుడు మాత్రం కాదన్నారు. నిందితుడికి తాము ఎలాంటి రక్షణ కల్పించడం లేదని తెలిపారు.
తమకు మహిళల భద్రతే ముఖ్యమన్నారు. ఈ ఘటనపై కేసు నమోదైన కొన్ని గంటల్లోనే పోలీసులు అతనిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని, ఘటనలో ప్రమేయం ఉన్న వారి నేపథ్యంలో ఎలా ఉన్నా వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
కాగా, అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని డిసెంబర్ 23న రాత్రి తన స్నేహితుడితో కలిసి వర్సిటీ ప్రాంగణంలో మాట్లాడుతుండగా ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చారు. ఆమె స్నేహితుడిపై దాడి చేసి... అతనిని అక్కడి నుంచి పంపించేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేశారు.