TGPSC: ఉద్యోగ నోటిఫికేషన్లపై టీజీపీఎస్సీ కీలక ప్రకటన

TGPSC key announcment on job notifications
  • వచ్చే మే 1లోగా కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని వెల్లడి
  • మార్చి 31లోగా ఖాళీల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడి
  • ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామన్న టీజీపీఎస్సీ
ఉద్యోగ నోటిఫికేషన్లపై టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. వచ్చే మే 1వ తేదీ నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది. ఇందుకోసం, మార్చి 31 లోగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపింది. ఖాళీల ప్రకారం నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్‌లో కసరత్తు చేస్తామని తెలిపింది.

కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది.

షెడ్యూల్ ప్రకారం గ్రూప్స్ ఫలితాలు విడుదలయ్యేలా చూస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ నెల 11, 12 తేదీల్లో బెంగళూరులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సదస్సు ఉంటుందని వెల్లడించారు. ఉద్యోగ పరీక్షల విధానాలపై సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు.

టీజీపీఎస్సీ గ్రూప్ 3 ప్రిలిమినరీ కీ విడుదల

రాష్ట్రంలో 1,365 ఉద్యోగ ఖాళీలకు నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ప్రిలిమినరీ కీని టీజీపీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించింది. మూడు పేపర్లకు నిర్వహించిన ఈ పరీక్షలకు 5.36 లక్షల మంది హాజరయ్యారు.
TGPSC
Telangana
Job Notifications

More Telugu News