Narendra Modi: ఏపీకి ఇప్పుడు సమయం వచ్చింది: విశాఖ సభలో ప్రధాని మోదీ
- విశాఖలో కూటమి సభ
- ఏపీ ఇక అభివృద్ధిలో దూసుకుపోతుందన్న ప్రధాని మోదీ
- ఏపీ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని వెల్లడి
- ఏపీకి, చంద్రబాబుకు కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టీకరణ
విశాఖ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఇక్కడి సింహాచల వరాహ నరసింహస్వామికి ప్రణామాలు ఆచరిస్తున్నానని తెలిపారు. ఏపీ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. తాను మూడోసారి ప్రధానిగా ఎన్నికవడంలో ఏపీ ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు మరువలేనని అన్నారు.
చంద్రబాబు ప్రసంగంలోని ప్రతి మాట వెనుక ఉన్న భావం అర్థమైందని... ఏపీకి సంబంధించి ప్రజలు, ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే విశ్వాసం చూపిస్తున్నారో, ఆ విశ్వాసానికి ఎక్కడా భంగం కలగకుండా మీ లక్ష్యాలన్నింటినీ సాకారం చేసేందుకు కృషి చేస్తానని మోదీ స్పష్టం చేశారు.
"ఇవాళ ఆంధ్ర ప్రజల స్వాగతం, ఆశీర్వాదాలు చూశాను. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆశయాల సాధనకు మద్దతుగా నిలుస్తాను. ఏపీ అభివృద్ధితో దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. 2047 నాటికి ఏపీ 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యానికి తోడ్పాటు అందిస్తాం. చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భుజం భుజం కలిపి నడుస్తుంది. అందుకే లక్షల కోట్ల విలువైన పథకాలతో ఏపీపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
నేడు రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేర్చుతాయి. ఏపీ ప్రజల సృజనాత్మకత వల్ల రాష్ట్రం ఐటీ, టెక్నాలజీకి ఒక పెద్ద కేంద్రంగా మారింది. ఏపీకి ఇప్పుడు సమయం వచ్చింది. సరికొత్త టెక్నాలజీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రబిందువుగా మారాలి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు ఏపీ సారథ్యం వహించాలి. ఏపీలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ హైడ్రోజన్ కూడా అలాంటి అభివృద్ధి చెందే ప్రాజెక్టే.
దేశంలో 2023లో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును ప్రారంభించాం. 2030 నాటికి ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ను మనదేశంలో ఉత్పత్తి చేయాలి అనేది మా లక్ష్యం. అందుకోసం ప్రారంభ దశలోనే రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్ లను తీసుకువస్తున్నాం. అందులో ఒకటి మన విశాఖ ప్రాంతంలో వస్తోంది. భవిష్యత్తులో విశాఖ నగరం ప్రపంచంలోనే అత్యధికంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే నగరంగా నిలుస్తుంది. ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా వేల ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఏపీలో మాన్యుఫ్యాక్చరింగ్ వ్యవస్థ కూడా అభివృద్ధి జరుగుతుంది.
ఇక, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేసే అదృష్టం నాకు దక్కింది. ఏపీలో పట్టణీకరణ కొత్త పుంతలు తొక్కనుంది. కృష్ణపట్నంలో క్రిస్ సిటీ ప్రాజెక్టు వల్ల లక్ష మందికి ఉద్యోగ ఉపాధి కలుగుతుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు పునాదిరాయి వేశాం. ఏపీ అభివృద్ధిలో ఈ రైల్వే జోన్ కూడా కీలకం కానుంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ద్వారా ఆంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. రైల్వే జోన్ వల్ల వ్యవసాయ, పర్యాటక రంగాలు ఊపందుకుంటాయి.
రాష్ట్రంలో ఇప్పటికే 7 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అమృత్ భారత్ కింద ఏపీలోని 70కి పైగా రైల్వే స్టేషన్లను ఆధునీకకరిస్తున్నాం. విశాఖ తీరం వందల ఏళ్లుగా ఎగుమతులు, దిగుమతుల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. సాగర సంబంధింత అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవడం ద్వారా అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చు. వికసిత్ ఆంధ్రకు కేంద్రం సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది" అని ప్రధాని మోదీ విశాఖ సభ ద్వారా భరోసా ఇచ్చారు.