Mosquito: జబ్బులకు ఇక చెక్.. మగ దోమలతో ఆడ దోమల పని ఫినిష్!
- దోమకాటు కారణంగా ఏటా 39 కోట్ల మంది వ్యాధులపాలు
- ప్రాణాలు కోల్పోతున్న మరెంతోమంది
- మగ దోమలతో ఆడ దోమలను చంపించే ప్రయోగానికి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల శ్రీకారం
దోమకాటు కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఏటికేడు దారుణంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 39 కోట్ల మంది డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధుల బారినపడుతున్నారు. ఇవన్నీ ఆడ దోమల వల్ల వ్యాపించేవే. ఈ నేపథ్యంలో వాటిని నిర్మూలించేందుకు ఆస్ట్రేలియా శాస్ట్రవేత్తలు సరికొత్త పరిశోధనలు చేపట్టారు. జన్యుమార్పిడి చేసిన మగదోమలతో ఆడ దోమలను చంపించే ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
‘టాక్టిక్ మేల్ టెక్నిక్’ పేరుతో ఈ ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మగదోమల వీర్యాన్ని విషపూరితం చేసే జన్యువును వాటిలో ప్రవేశపెడుతున్నారు. ఈ మగ దోమలు ఆడ దోమలతో కలిసినప్పుడు వాటి వీర్యంలో ఉండే విష ప్రొటీన్లు ఆడ దోమల ఆరోగ్యం క్రమంగా క్షీణింపజేసి చివరికి చనిపోయేలా చేస్తాయి. ఇలా చేయడం వల్ల ఆడ దోమల జీవిత కాలాన్ని 60 శాతం తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే దోమకాటు కారణంగా వ్యాధులు, మరణాల సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు.