Daku Maharaj: తిరుపతి విషాదం నేపథ్యంలో ‘డాకు మహరాజ్’ ప్రీ రిలీజ్ వేడుక రద్దు

Daku Maharaj Pre Release Event Cancelled

  • నేడు అనంతపురంలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • పవిత్ర స్థలంలో భక్తుల ప్రాణాలు పోవడం హృదయవిదారకమని చిత్ర నిర్మాణ సంస్థ వ్యాఖ్య
  • సంక్రాంతి కానుకగా ఈ నెల 12న డాకు మహరాజ్ విడుదల

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘డాకు మహరాజ్’ ప్రీ రిలీజ్ వేడుకను నిర్మాణ సంస్థ రద్దు చేసింది. గురువారం అనంతపురంలో ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం సరికాదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 

పవిత్ర స్థలంలో తొక్కిసలాట జరగడం, ఆరుగురు భక్తులు చనిపోవడం అత్యంత బాధాకరమని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ విషాద సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపడం సరికాదని భావిస్తున్నట్లు పేర్కొంది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అత్యంత గౌరవంతో డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

కాగా, సంక్రాంతి కానుకగా ఈ నెల 12న డాకు మహరాజ్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు నిర్మాణ సంస్థ ఏర్పాట్లు చేసింది. ఏపీ మంత్రి నారా లోకేశ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. అయితే, తిరుపతిలో భక్తులు చనిపోయిన నేపథ్యంలో ఈవెంట్ ను రద్దు చేసింది.

  • Loading...

More Telugu News