TTD: శ్రీవారి వైకుంఠ దర్శనం కౌంటర్ల మూసివేత.. మళ్లీ ఎప్పుడంటే..!

Vaikunta Dwara Darshan Tokens Issue Completed Says TTD
  • మూడు రోజులకు 1.20 లక్షల టికెట్ల జారీ
  • 13 వతేదీ నుంచి రోజుకు 40 వేల టికెట్లు
  • ఏ రోజుకు ఆరోజే ఇవ్వనున్నట్లు టీటీడీ వెల్లడి
తిరుమల శ్రీవారి వైకుంఠ దర్శనం టికెట్ కౌంటర్లు మూతపడ్డాయి. గురువారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు టికెట్లు జారీ చేసిన టీటీడీ సిబ్బంది.. మొత్తం 1.20 లక్షల టికెట్లను భక్తులకు జారీ చేశారు. ముందుగా నిర్ణయించిన కోటా పూర్తికావడంతో కౌంటర్లు క్లోజ్ చేశారు. ఈ నెల 13న తిరిగి వైకుంఠ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రోజూ 40 వేల టికెట్ల చొప్పున ఏరోజుకు ఆరోజు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద వైకుంఠ దర్శన టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఈ నెల 10, 11, 12 తేదీల్లో వైకుంఠ దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మూడు రోజులకు స్వామి వారి దర్శన టోకెన్లను 1.20 లక్షల భక్తులకు జారీ చేశామని పేర్కొంది. ఈ నెల 18వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తామని తెలిపింది. 12వ తేదీ వరకు దర్శన టోకెన్లను ఇప్పటికే జారీ చేశామని, 13వ తేదీ నుంచి ఏరోజుకు ఆరోజు టోకెన్లు జారీ చేస్తామని వివరించింది. కాగా, వైకుంఠ దర్శన టోకెన్ల కోసం బుధవారం రాత్రి తిరుపతిలో తొక్కిసలాట జరగగా ఆరుగురు భక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషాదం తర్వాత  భద్రతా సిబ్బందితో పరిస్థితిని చక్కదిద్దిన టీటీడీ.. గురువారం ఉదయం టోకెన్లను జారీ చేసింది.
TTD
Vaikunta Darshan
Tokens Issue
Counter Closed

More Telugu News