Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేసియా ప్రకటించిన ఏపీ సర్కార్

AP government has announced Rs 25 Lakhs ex gratia for the victims of the Tirupati stampede

  • మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం
  • రుయా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన
  • మరికాసేపట్లో రుయా హాస్పిటల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేసియా అందించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన చేశారు. 

గురువారం ఉదయం తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొక్కిసలాట ఘటన క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. అనంతరం నష్టపరిహారాన్ని ప్రకటించారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడం తన మనసును తీవ్రంగా కలచివేసిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.

కాగా, హోంమంత్రి అనిత, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా రుయా హాస్పిటల్‌కు చేరుకున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాస్పిటల్‌కు చేరుకొని బాధితులను పరామర్శించనున్నారు. రుయాతో పాటు స్విమ్స్ హాస్పిటల్‌లో కూడా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఇదిలావుంచితే, ఈ విషాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు తమ కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు.

  • Loading...

More Telugu News