Mohan Babu: మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట

Actor Mohan Babu gests small relief in Supreme Court
  • జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ నిరాకరించిన టీజీ హైకోర్టు
  • సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన మోహన్ బాబు
  • తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
  • అప్పటి వరకు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవద్దంటూ ఉత్తర్వులు
  • మోహన్ బాబు తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గి
కుటుంబ గొడవలతో సీనీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ వార్తల్లో ప్రముఖంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ గొడవలను కవరేజ్ చేసేందుకు హైదరాబాద్ లోని జల్ పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి మీడియా ప్రతినిధులు వెళ్లినప్పుడు... ఒక రిపోర్టర్ పై మోహన్ బాబు మైక్ తో దాడి చేశారు. ఈ దాడిలో సదరు రిపోర్టర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదయింది. 

ఈ కేసుకు సంబంధించి మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును మోహన్ బాబు ఆశ్రయించారు. 

ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో మోహన్ బాబుకు స్వల్ప ఊరట లభించినట్టయింది. 

మరోవైపు, వాదనల సందర్భంగా మోహన్ బాబు తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ... కుమారుడితో గొడవ నేపథ్యంలో దాడి ఘటన జరిగిందని చెప్పారు. కావాలని ఆ పని మోహన్ బాబు చేయలేదని తెలిపారు. జరిగిన దానికి సదరు జర్నలిస్టుకు మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణలు చెప్పారని... పరిహారం చెల్లించేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మోహన్ బాబు ఇంటి ఆవరణలో మీడియా ప్రతినిధులు ట్రెస్ పాస్ చేశారని తెలిపారు. దీనికి సమాధానంగా సుప్రీంకోర్టు స్పందిస్తూ... ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా? అని ప్రశ్నించింది.
Mohan Babu
Tollywood
Supreme Court

More Telugu News