Omar Abdullah: ఇండియా కూటమి ఇంకెందుకు? రద్దు చేయండి: ఒమర్ అబ్దుల్లా
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ ల మధ్య గొడవను ఉద్దేశించి విమర్శలు
- కూటమి నాయకత్వంపై, అజెండాపై ఇప్పటికీ స్పష్టత లేదు.. ఇంకా కలిసి ఉండడం దేనికని ప్రశ్న
- గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి
‘‘ఇండియా కూటమిగా ఏర్పడి ఇంతకాలమైనా నాయకత్వంపై స్పష్టత లేదు.. కూటమి అజెండా ఏంటనేది ఎవరికీ తెలియదు.. అసలు ఇండియా కూటమి ఉనికిలో ఉందా లేదా అనేది కూడా తెలియట్లేదు. మరి ఇంకెందుకు ఈ కూటమి? కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడిగా ఫైట్ చేయడానికే అయితే ఆ అవసరం తీరిపోయింది కాబట్టి ఇండియా కూటమిని రద్దు చేయాలి’’ అంటూ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిపై పోరాడేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఏర్పాటు చేసిన కూటమే ‘ఇండియా బ్లాక్’.. కూటమి ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు దానికి నాయకత్వం వహించేది ఎవరనే దానిపై ఏ పార్టీకీ స్పష్టత లేదు. లోక్ సభ ఎన్నికల వరకే పొత్తు పెట్టుకుంటామని, అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగానే పోటీ చేస్తామని గతంలో తృణమూల్ చీఫ్ మమతాబెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా ఆప్ సొంతంగా పోటీ చేస్తోంది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్, ఆప్ నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్, ఆప్ ల మధ్య తీవ్ర విభేదాలు పొడసూపాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతిస్తున్నట్లు ఇండియా కూటమిలోని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, టీఎంసీ చీఫ్ మమతాబెనర్జీ ప్రకటించారు. తాజా పరిణామాలపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, ఎన్సీపీ లీడర్ ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఢిల్లీ ఎన్నికలతో తమకు సంబంధం లేదంటూనే ఇండియా కూటమిని రద్దు చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.