Chandrababu: తిరుపతి మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల సాయం... కాంట్రాక్టు ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

CM Chandrababu announces Rs 25 lakhs for victims families in Tirupati stumpede

  • తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ పంపిణీ కేంద్రాల వద్ద తొక్కిసలాట
  • ఆరుగురి మృతి... 35 మందికి గాయాలు
  • తిరుపతిలో చంద్రబాబు ప్రెస్ మీట్

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం తెలిసిందే. నేడు తిరుపతి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై నిప్పులు చెరిగారు. ఘటన స్థలిని స్వయంగా పరిశీలించిన ఆయన, ఆసుపత్రిలో క్షతగాత్రులను ఓదార్చారు. ఈ ఘటనలో ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసిన చంద్రబాబు... మరో ముగ్గురు అధికారులపై బదిలీ వేటు వేశారు. 

ఈ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు... కీలక నిర్ణయాలు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున టీటీడీ ద్వారా ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. ఆరుగురు మృతుల కుటుంబాల్లో ఒకరికి చొప్పున కాంట్రాక్టు ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. 

తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తామని చెప్పారు. వారి ఆరోగ్యం మెరుగయ్యే వరకు వైద్య ఖర్చులు భరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గాయపడిన మరో 33 మందికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన 35 మందికి తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. క్షతగాత్రులను వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 

తిరుపతిలో టికెట్లు ఇవ్వడం గతంలో లేని సంప్రదాయం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. భక్తులు తిరుమలలో క్యూలైన్లలో ఉంటే దైవ చింతనలో గడుపుతారని వివరించారు. వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజులకు పెంచారని, ఎందుకు పెంచారో తెలియదని అన్నారు. ఏదేమైనా, మొదటి నుంచి ఉన్న సంప్రదాయాలు మార్చడం మంచిదికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పద్ధతులు ఉండాలని అభిలషించారు. రాష్ట్రంలోని ఏ ఆలయంలోనూ అపచారం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

తిరుమల వెంకటేశ్వరస్వామి అంటే ప్రజల్లో భక్తి రోజురోజుకు పెరిగిపోతుందని అన్నారు. పవిత్ర పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకోవాలన్న భావన ప్రజల్లో అంతకంతకు పెరుగుతోందని తెలిపారు. పవిత్ర దినాల్లో దర్శనాలు సాఫీగా చేయించాల్సిన బాధ్యత అధికారులదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. 

గత నాలుగైదేళ్లుగా జరిగిన విషయాలన్నింటినీ ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ వస్తున్నామని... ప్రసాదాలు, అన్నదానం, కాటేజీలు... ఇలా అనేక అంశాలను సరిచేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వ పరంగా, అధికారుల పరంగా సామర్థ్యాలు పెంచుకోవాల్సి వస్తే, పెంచుకుంటామని అన్నారు. 

ఈవో శ్యామలరావుకో, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికో దీన్ని ఆపాదించలేమని, వాళ్లు ఎగ్జిక్యూటివ్ లుగా, ఈయన చైర్మన్ గా వచ్చారు అని వివరించారు. వాళ్లు వేరే వ్యవస్థల నుంచి ఇక్కడికొచ్చారని, వాళ్లు ఇంతకుముందు ఇలాంటి జాబ్ లు చేయలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే టీటీడీకి విభిన్నమైన కోణాలు ఉన్నాయని... ప్రజల మనోభావాలు, ఇతర సెంటిమెంట్లు ఉన్నాయని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News