Train Passenger: మద్యం మత్తులో టీటీఈని కొట్టిన ప్రయాణికుడు.. అటెండెంట్ సాయంతో చితకబాదిన టీటీఈ.. వీడియో ఇదిగో!

Drunk Man Pinned Down By Ticket Checker And Train Attendant Flogs Him
  • అమృత్ సర్ కతిహార్ ఎక్స్ ప్రెస్ లో ఘటన
  • అటెండెంట్ లంచం పుచ్చుకున్నాడని తోటి ప్రయాణికుల ఆరోపణ
  • బాధితుడితో కలిసి మద్యం సేవించాడని రైల్వే పోలీసులకు ఫిర్యాదు
  • టీటీఈని అరెస్టు చేసిన పోలీసులు.. పరారీలో కోచ్ అటెండెంట్
రైలులో మద్యం సేవించి తోటి మహిళా ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించాడో వ్యక్తి.. ప్రయాణికుల ఫిర్యాదుతో అక్కడికి వచ్చిన టీటీఈని కూడా చెంపదెబ్బ కొట్టాడు. దీంతో రెచ్చిపోయిన టీటీఈ, కోచ్ అటెండెంట్ తో కలిసి సదరు ప్రయాణికుడిని చితకబాదాడు. కిందపడేసి, శరీరంపైకెక్కి హింసించాడు. కోచ్ అటెండెంట్ బెల్ట్ తో కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, నిందితుడి దగ్గర లంచం తీసుకున్నాడని, మద్యం తాగాడని ప్రయాణికులు ఆరోపించారు. అమృత్ సర్ కతిహార్ ఎక్స్ ప్రెస్ లో చోటుచేసుకుందీ ఘటన.

పంజాబ్ కు చెందిన షేక్ తాజుద్దీన్ బుధవారం అమృత్ సర్ కతిహార్ ఎక్స్ ప్రెస్ లో బిహార్ లోని సివన్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరాడు. రైల్వే కోచ్ అటెండెంట్లు విక్రమ్ చౌహాన్, సోను మహతో లకు లంచం ఇచ్చి తన సీటులోనే మద్యం సేవించాడు. తాజుద్దీన్ తో కలిసి చౌహాన్, మహతో కూడా మద్యం సేవించారు. ఆ తర్వాత తోటి మహిళా ప్రయాణికులతో తాజుద్దీన్ అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో చౌహాన్ రైల్వే టీటీఈ రాజేశ్ కుమార్ ను పిలిచాడు.

ఈ సందర్భంగా రాజేశ్ కుమార్ తో వాగ్వాదానికి దిగిన తాజుద్దీన్.. కోపంతో చెంపదెబ్బ కొట్టాడు. దీంతో రెచ్చిపోయిన రాజేశ్ కుమార్.. తాజుద్దీన్ ను డోర్ వద్దకు లాక్కుని వెళ్లి చౌహాన్ సాయంతో దాడి చేశాడు. తాజుద్దీన్ ను కిందపడేసి వీపుపై కూర్చోగా.. చౌహాన్ బెల్ట్ తో చితకబాదాడు. తాజుద్దీన్ వీపుపై రాజేశ్ కుమార్ ఎగిరి దూకడం వీడియోలో కనిపించింది. ప్రయాణికులు సమాచారం అందించడంతో తర్వాతి స్టేషన్ లో రైల్వే పోలీసులు టీటీఈని అదుపులోకి తీసుకున్నారు. చౌహాన్, మహతోలు పరారయ్యారు. రైలు మొత్తం వెతికినా దొరకలేదు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.
Train Passenger
Drunk
TTE
Viral Videos
Drunk Man Floged

More Telugu News