Crime News: లివ్-ఇన్ పార్టనర్‌ని చంపి డెడ్‌బాడీని 8 నెలలపాటు ఫ్రిడ్జ్‌లో ఉంచిన వ్యక్తి

married man allegedly killed Woman and kept body in a fridge for around eight months
  • పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో దారుణ హత్య
  • అద్దె ఇంట్లో నేరానికి పాల్పడ్డ నిందితుడు
  • ఇల్లు ఖాళీ చేసినా... కొన్ని వస్తువులను ఒక పోర్షన్‌లో వదిలి వెళ్లిన వైనం
  • విద్యుత్ ఆఫ్ చేయడంతో ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన
  • మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన షాకింగ్ ఘటన
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2022 నాటి శ్రద్ధా వాకర్ హత్యోదంతం తరహాలో మరో ఘటన వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌లో వివాహితుడైన ఓ వ్యక్తి లివ్-ఇన్ పార్టనర్‌ను దారుణంగా చంపి ఆమె మృతదేహాన్ని ఏకంగా 8 నెలల పాటు ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టాడు. పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో ఆమెను అంతమొందించాడని తేలింది. రాష్ట్రంలోని దేవాస్ పట్టణంలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

నిందితుడు సంజయ్ పాటిదార్ అద్దెకు తీసుకున్న ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. మృతురాలు చీర ధరించి ఉందని, ఆమె ఒంటిపై నగలు కూడా ఉన్నాయని, చేతులను మెడకు కట్టేశాడని వివరించారు. శరీరం కుళ్లిపోయిన స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు. మృతురాలి పేరు పింకీ ప్రజాపతి అని, గతేడాది జూన్‌లో హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్టు చెప్పారు. 

నిందితుడు పాటిదార్ ఉజ్జయిని నగరానికి చెందినవాడని, ఐదేళ్లపాటు మహిళతో లివ్-ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో తన స్నేహితుడి సాయంతో ఈ దారుణానికి పాల్పడ్డాడని వివరించారు.

బయటపడిందిలా...
నిందితుడు సంజయ్ పాటిదార్ అద్దెకు ఉంటున్న ఇంటిని కొంతకాలం క్రితమే ఖాళీ చేశాడు. అయితే, తన వస్తువులు కొన్నింటిని మాత్రం ఇంట్లోని ఒక పోర్షన్‌లో ఉంచాడు. ఇదే ఇంట్లోకి మరొకరు అద్దెకు దిగారు. పాటిదార్ సామాన్లు ఉంచిన పోర్షన్‌లో మనుషులు ఎవరూ ఉండకపోవడంతో విద్యుత్‌ను ఆఫ్ చేశారు. దీంతో, ఫ్రిడ్జ్ పనిచేయకపోవడంతో డెడ్‌బాడీ దుర్వాసన రావడం మొదలైంది. 

దీంతో ఇరుగుపొరుగువారి సాయంతో తలుపులు తెరిచి చూడగా డెడ్‌‌బాడీ కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని శుక్రవారం బయటకు తీశామని దేవాస్ ఎస్పీ పునీత్ గెహ్లాట్ చెప్పారు. ఇంటి యజమాని ధీరేంద్ర శ్రీవాస్తవ ఇండోర్‌లో నివసిస్తున్నారని, జూన్ 2023లో పాటిదార్‌కు అద్దెకు తీసుకున్నాడని వెల్లడించారు. ఆ తర్వాత ఖాళీ చేశాడని, అప్పుడప్పుడు వచ్చి వెళుతుండేవాడని, ఈ ఘటనలో తదుపరి విచారణ జరుపుతామని ఆయన పేర్కొన్నారు.
Crime News
Madhya Pradesh
Viral News

More Telugu News