Arvind Kejriwal: వచ్చే నెలతో ఆప్ పీడ విరగడ అవుతుంది: అమిత్ షా

kejriwal is not only aapda for delhi but also for aap says amit shah
  • అమ్ ఆద్మీ పార్టీ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా
  • చెడు రాజకీయ నేతకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ కేజ్రీవాల్‌లో ఉన్నాయంటూ అమిత్ షా విమర్శలు
  • కేజ్రీవాల్ ఢిల్లీకే కాదు.. ఆయన పార్టీకి కూడా విపత్తేనన్న అమిత్ షా
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య ప్రచార పర్వంలో మాటల యుద్దం కొనసాగుతోంది. ఆప్ సర్కార్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జేఎల్ఎన్ స్టేడియంలో శనివారం జరిగిన జుగ్గి బస్తీ ప్రధాన్ సమ్మేళన్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. 

కేజ్రీవాల్ లక్ష్యంగా అమిత్ షా విమర్శలు చేశారు. ఢిల్లీకి వచ్చే నెలలో ఆప్ పీడ విరగడ అవుతుందని జోస్యం చెప్పారు. కేజ్రీవాల్ ఢిల్లీకే కాదు.. ఆయన పార్టీకి కూడా విపత్తేనని విమర్శించారు. చెడు రాజకీయ నేతకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ కేజ్రీవాల్‌లో ఉన్నాయని దుయ్యబట్టారు. దేశంలోనే నెంబర్ వన్ అవినీతి నేత కేజ్రీవాల్ అని విరుచుకుపడ్డారు. 

ప్రధాని మోదీ కూడా ఇటీవల నిర్వహించిన సభల్లో కేజ్రీవాల్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఇతర బీజేపీ నేతలు సైతం కేజ్రీవాల్ లక్ష్యంగానే విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. కేజ్రీవాల్ ధనవంతుడు అంటూ ఆయనకు సంబంధించిన పోస్టర్లు వేసి ప్రచారం చేస్తున్నారు. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యనే నెలకొని ఉంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్దం తారా స్థాయిలో నడుస్తోంది. కాగా, ఢిల్లీలో ఫిబ్రవరి 5 న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8 న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.  
Arvind Kejriwal
AAP
BJP
Amit Shah
Delhi assembly elctions

More Telugu News