Chandrababu: సొంతూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు

Chandrababu lays foundation for many development works in own village
  • సంక్రాంతి జరుపుకునేందుకు స్వగ్రామానికి విచ్చేసిన చంద్రబాబు
  • రూ.కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజ
  • మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ
  • మహిళా సంఘాలకు నిత్యావసరాల పంపిణీ కోసం ఈజీ మార్ట్ తో ఒప్పందం
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో మకాం వేశారు. ఇవాళ ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

స్వగ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సబ్ స్టేషన్ ను రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. మహిళా సంఘాలకు చౌకగా, నాణ్యమైన నిత్యావసరాల చేరవేతకు ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈజీ మార్ట్ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న మహిళా సంఘాలకు నిత్యావసరాలు డోర్ డెలివరీ చేస్తారు. 

ఇవాళ్టి తన పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నారావారిపల్లెలో మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లల ఐక్యూ పెరుగుదలకు కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలుత నారావారిపల్లె పరిధిలోని 8 అంగన్ వాడీ కేంద్రాల్లో ఐక్యూ పెరుగుదల విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. మైక్రో ఇరిగేషన్ పథకాన్ని కూడా చంద్రబాబు ప్రారంభించారు.

ఇక, రూ.2 కోట్లతో రంగంపేటలో రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. రూ.1 కోటితో రంగంపేట జడ్పీ హైస్కూల్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తన పర్యటన సందర్భంగా చంద్రబాబు పలువురి నుంచి వినతులు కూడా స్వీకరించారు.
Chandrababu
Naravaripalle
Sankranti
TDP

More Telugu News