Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి కేంద్రం అనుమతి

Centre grants ED approval to prosecute AAP Chief Arvind Kejriwal in liquor policy case
  • ప్రజా ప్రతినిధుల విచారణకు ముందు గవర్నర్ అనుమతి తప్పనిసరన్న సుప్రీంకోర్టు
  • ఈడీకి లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా లేఖ నేపథ్యంలో కేంద్రం అనుమతి
  • ఇదే కేసులో గతేడాది మార్చి 21న అరెస్ట్
  • సుప్రీంకోర్టు బెయిలు ఇవ్వడంతో సెప్టెంబర్‌లో విడుదల
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి కేంద్రం అనుమతినిచ్చింది. ఈ కేసులో కేజ్రీవాల్ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతినిచ్చిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రతినిధులను విచారించే ముందు ఈడీ ముందస్తు అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు గతేడాది నవంబర్‌లో ఇచ్చిన తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.  

ఈ కుంభకోణంలో కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారుగా ఉన్నారని, కాబట్టి ఆయనను విచారించుకోవచ్చంటూ ఆ తర్వాతి నెలలో ఈడీకి లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా లేఖ రాశారు. కాగా, అంతకుముందు కేజ్రవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తూ తనపైనా, ఇతరులపైనా ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేయడాన్ని సవాలు చేశారు. ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేయడానికి ముందు ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని, కాబట్టి ఈడీ చార్జ్‌షీట్ చట్ట విరుద్ధమని వాదించారు. 

ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజాగా ఈ కేసులో విచారణకు ఈడీకి అనుమతినిస్తూ ఆదేశాలు జారీచేసింది. కాగా, ఇదే కేసులో కేజ్రీవాల్‌ గతేడాది మార్చి 21న అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత అదే ఏడాది జూన్ 26న సీబీఐకి కూడా ఆయనను అరెస్ట్ చేసింది. సెప్టెంబర్‌లో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. 
Arvind Kejriwal
Delhi Liquor Scam
ED
VK Saxena

More Telugu News