Nara Lokesh: నారా లోకేశ్, మనోజ్ భేటీలో చర్చకు రాని ఆస్తుల వివాదం

Property dispute not discussed in Manchu Manoj meeting with Nara Lokesh
  • నారావారిపల్లెకు వెళ్లిన మంచు మనోజ్, మౌనిక
  • లోకేశ్ తో 45 నిమిషాల పాటు గడిపిన మనోజ్
  • మంచు కుటుంబ గొడవల్లో ఏ వర్గం వైపు లేకుండా వ్యవహరిస్తున్న నారా కుటుంబం
మంచు కుటుంబ గొడవ హైదరాబాద్ నుంచి తిరుపతికి షిఫ్ట్ అయింది. ఈ ఉదయం మోహన్ బాబు యూనివర్శిటీలోకి వెళ్లేందుకు యత్నించిన మనోజ్ ను పోలీసులు అడ్డుకున్నారు. అయితే మనోజ్ యూనిర్శిటీలోకి రాకుండా ఇప్పటికే మోహన్ బాబు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్శిటీలోకి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని మనోజ్ బౌన్సర్లు వీడియో తీశారు. 

ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్శిటీ నుంచి నారావారిపల్లెకు మనోజ్ దంపతులు బయల్దేరారు. నారావారిపల్లెలో నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. అయితే ఇద్దరూ చాలా సేపు గడిపినప్పటికీ వీరి మధ్య ఆస్తుల వివాదం చర్చకు రానట్టు సమాచారం. ఇది మంచు కుటుంబ వ్యక్తిగత వివాదం అయిన నేపథ్యంలో ఏ వర్గం వైపు లేకుండా నారా కుటుంబం వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. 

మరోవైపు, యూనివర్శిటీ వద్ద చంద్రబాబుతో మోహన్ బాబు తీసుకున్న ఫొటోలు, లోకేశ్ తో మంచు విష్ణు తీసుకున్న ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో నారా కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని అందరికీ తెలిపేందుకు లోకేశ్ ను మనోజ్ కలిసినట్టు తెలుస్తోంది.
Nara Lokesh
Telugudesam
Manchu Manoj
Tollywood

More Telugu News