Amit Shah: మోదీ, చంద్రబాబు నాయకత్వంలో అంతకు మూడింతల ప్రగతి సాధిస్తాం: అమిత్ షా

Amit Shah confidant on AP development under Modi and Chandrababu leadership
  • ఏపీలో అమిత్ షా పర్యటన
  • ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు
  • ఎన్ఐడీఎం ప్రాంగణానికి ప్రారంభోత్సవం
  • ఏపీలో కూటమికి చరిత్రాత్మక విజయం అందించారని వెల్లడి
కేంద్ర మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడ నూతనంగా నిర్మించిన ఎన్ఐడీఎం ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ప్రసంగించారు. తెలుగులో ప్రసంగించలేకపోతున్నందుకు అందరూ తనను క్షమించాలని నవ్వుతూ అన్నారు.

ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని వెల్లడించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎల్లవేళలా సహకారం అందిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేసిందో అందరికీ తెలుసని, గత ప్రభుత్వం చేసిన విధ్వంసం మానవ విపత్తుకు సంబంధించినదని అన్నారు. ఆ విపత్తు నుంచి రక్షించేందుకు ఎన్డీయే కూటమి వచ్చిందని అమిత్ షా పేర్కొన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం గురించి చింతించవద్దని... ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల నాయకత్వంలో ఏపీలో అంతకు మూడింతల ప్రగతి సాధిస్తామని భరోసా ఇచ్చారు. గడచిన ఆర్నెల్లలోనే ఏపీకి రూ.3 లక్షల కోట్ల విలువైన సహకారం అందించామని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,440 కోట్ల ప్యాకేజి ప్రకటించామని, ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ముందుకు తీసుకెళతామని చెప్పారు. 

గత ప్రభుత్వం అమరావతి రాజధానిని బుట్టదాఖలు చేసిందని, తాము అమరావతికి చేయూతనందిస్తామని తెలిపారు. హడ్కో ద్వారా అమరావతి నిర్మాణానికి రూ.27 వేల కోట్ల సాయం అందిస్తున్నామని అమిత్ షా వివరించారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరంపై సీఎం చంద్రబాబుతో చర్చించానని అన్నారు. 2028 లోపు ఏపీ మొత్తం పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు పారిస్తామని పేర్కొన్నారు. 

ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబుకు ప్రధాని మోదీ అండదండలు ఉన్నాయని స్పష్టం చేశారు. విశాఖలో రూ.2 లక్షల కోట్ల గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడులు వస్తున్నాయని, విశాఖ రైల్వే జోన్ ను కూడా పట్టాలెక్కించామని అమిత్ షా వెల్లడించారు.
Amit Shah
NDRF
Chandrababu
Narendra Modi
NDA
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News