Hamas: 15 నెలల ప్రత్యక్ష నరకం తర్వాత కుటుంబాన్ని కలిసిన వేళ.. హమాస్ బందీల భావోద్వేగం.. వీడియో ఇదిగో!

Moment When 3 Israeli Hostages Reunited With Families After 15 Months
  • ఇజ్రాయెల్ హమాస్ మధ్య అమలులోకి కాల్పుల విరమణ ఒప్పందం
  • తొలిదశలో ముగ్గురు బందీలను విడిచిపెట్టిన మిలిటెంట్లు
  • 90 మంది పాలస్తీనా ఖైదీలను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు ఆదివారం ఉదయం 11 గంటల నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా 90 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ప్రతిగా హమాస్ మిలిటెంట్లు తమ బందీలలో ముగ్గురు మహిళలను రిలీజ్ చేశారు. గాజా స్ట్రిప్ లోని రహస్య ప్రాంతం నుంచి తీసుకొచ్చి రెడ్ క్రాస్ ప్రతినిధులకు అప్పగించారు. రెడ్ క్రాస్ వాహనాల్లో బార్డర్ దాటి ఇజ్రాయెల్ లోకి అడుగుపెట్టిన బందీలను సైనికులు వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. దాదాపు పదిహేను నెలల ప్రత్యక్ష నరకం తర్వాత తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆ బందీలు, వారిని చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఓవైపు కన్నీరు, మరోవైపు సంతోషంతో కుటుంబ సభ్యులను హత్తుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

హమాస్ మిలిటెంట్లు విడుదల చేసిన ముగ్గురు మహిళలు.. రోమి గోనెన్, డోరన్ స్టెయిన్ బ్రీచర్, ఎమిలి డామరి అని ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలిపాయి. కాగా, బందీలకు స్వాగతం పలికేందుకు టెల్ అవీవ్ లోని హోస్టేజ్ స్క్వేర్ వద్ద వేలాదిగా పౌరులు గుమిగూడారు. సైనిక వాహనాల్లో నుంచి ముగ్గురు బందీలు దిగడం చూసి వారంతా సంతోషంతో కేరింతలు కొట్టారు. పలువురు సంగీతం ప్లే చేస్తూ దేశభక్తి గీతాలు పాడారు. బందీలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ లో పలకరించారు. యావత్ దేశం మిమ్మల్ని ఇంటికి స్వాగతిస్తోందని చెప్పారు. కాగా, ముగ్గురు బందీల విడుదలతో మిగతా బందీల కుటుంబాల్లో ఆశలు చిగురించాయి.
Hamas
Viral Videos
Israel
Hostages Release
Ceasefire

More Telugu News