Raghu Rama Krishna Raju: జగన్ బెయిల్ రద్దుపై రఘురామ పిటిషన్ పై సుప్రీంకోర్టులో కీలక పరిణామం

Supreme Court adjourns Raghu Rama Krishna Raju petition on Jagan bail cancelation
  • కేసులను విచారిస్తున్న ధర్మాసనాన్ని మార్చిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
  • జస్టిస్ వీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ధర్మాసనానికి కేసుల బదిలీ
  • సీబీఐ, నిందితులు కుమ్మక్కయ్యారన్న రఘురామ తరపు న్యాయవాది
వైసీపీ అధినేత జగన్ బెయిల్ రద్దు, మరో ధర్మాసనానికి కేసుల బదిలీకి సంబంధించి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులను విచారిస్తున్న ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మార్చింది. గతంలో విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం నుంచి జస్టిస్ వీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ధర్మాసనానికి మార్చింది.

గత 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ధర్మాసనం ముందు రఘురామ తరపు న్యాయవాది శ్రీనివాసన్ వాదించారు. గత పదేళ్లుగా ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్ ను కూడా డిస్పోజ్ చేయలేదని చెప్పారు. సీబీఐ, నిందితులు కుమ్మక్కై కేసును ఒక్క అడుగు కూడా కదలనీయడం లేదని అన్నారు. డిశ్చార్జ్ పిటిషన్లపై ఎలాంటి నిర్ణయాలను వెలువరించకుండానే ఐదుగురు జడ్జీలు బదిలీ అయ్యారని... ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ పై కూడా నిర్ణయం వెలువరించకుండానే జడ్జిలు బదిలీ కావడంలో కుట్రకోణం దాగి ఉందని చెప్పారు. 

ఈ నేపథ్యంలోనే కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశామని... అయితే బదిలీ సాధ్యం కాదని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని... అందువల్ల కేసు విచారణ పూర్తి స్థాయిలో జరగాలని కోరుకుంటున్నట్టు రఘురామ న్యాయవాది తెలిపారు.

గత పదేళ్లుగా జగన్ బెయిల్ పై ఉన్నారని... సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ట్రయల్ లో జాప్యం జరుగుతోందని... కేసులో వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరపున న్యాయవాది కోరారు. ఈ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని... కేసు అక్కడ పెండింగ్ లో ఉందని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఈ క్రమంలో విచారణను వచ్చే సోమవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.
Raghu Rama Krishna Raju
Telugudesam
Jagan
YSRCP
Supreme Court

More Telugu News