Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ... వి.ప్రకాశ్‌ను ప్రశ్నించిన కమిషన్

V Prakash appears before commission in Kaleswaram Project
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్
  • 101వ సాక్షిగా ప్రకాశ్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన కమిషన్
  • తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరంకు సైట్ మార్పుపై కమిషన్ ప్రశ్నించిందన్న ప్రకాశ్
కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ హాజరయ్యారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై కమిషన్ ఆయనను ప్రశ్నించింది. విచారణ అనంతరం వి.ప్రకాశ్ మీడియాతో మాట్లాడారు.

ఈ కేసులో 101వ సాక్షిగా తన స్టేట్‌మెంట్‌ను కమిషన్ రికార్డ్ చేసుకుందన్నారు. తన వద్ద సమాచారం ఉందని గతంలో తానూ కమిషన్‌కు ఓ స్టేట్‌మెంట్, ఓ నోట్ సమర్పించానన్నారు. వాటి ఆధారంగా కమిషన్ తనను క్రాస్ ఎగ్జామిన్ చేసిందన్నారు. వీటిలో కొన్ని అంశాలపై తన వివరణ తీసుకున్నారని తెలిపారు.

తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరంకు సైట్‌ను ఎందుకు మార్చవలసి వచ్చింది? దానిని సమర్థిస్తున్నారా? అంటూ పలు ప్రశ్నలు వేసినట్లు చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని, బ్యారేజీ ఎత్తును తగ్గించాలని మహారాష్ట్ర అభ్యంతరం తెలిపిందని వెల్లడించారు. అందుకే మార్చినట్లు చెప్పారు.

మేడిగడ్డ వద్ద ఆనకట్ట వద్దని ఇంజినీర్ల కమిటీ చెప్పింది కదా? అని కమిషన్ ప్రశ్నించిందని, కానీ రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ అలా చెప్పలేదని ఆయన తెలిపారు. బొగ్గు గనుల వద్ద సొరంగాలు వద్దన్న సిఫార్సులను నాటి ప్రభుత్వం గౌరవించినట్లు చెప్పారు. నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకొని కాళేశ్వరంను నిర్మించినట్లు చెప్పారు. తాము రికార్డులు, డాక్యుమెంట్ల ఆధారంగా పనిచేస్తామన్నారు.
Kaleshwaram Project
Telangana
Congress
BRS

More Telugu News