Team India: టీమిండియా జెర్సీలపై పాకిస్థాన్ పేరు... క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ కార్యదర్శి

BCCI clarifies on host Pakistan name on Team India jerseys
  • ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ
  • పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా మెగా టోర్నీ
  • ప్రతి జట్టు ఆటగాళ్ల జెర్సీలపై పాకిస్థాన్ పేరుతో టోర్నీ లోగో
  • తొలుత వ్యతిరేకించిన బీసీసీఐ
  • ఐసీసీ హెచ్చరికలతో మనసు మార్చుకున్న భారత క్రికెట్ బోర్డు
పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా హైబ్రిడ్ మోడల్ లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఫిబ్రవరి 19న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. పాకిస్థాన్ ఆతిథ్య దేశం కాబట్టి... ఈ టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టు ధరించే జెర్సీలపై టోర్నమెంట్ లోగోతో పాటు పాకిస్థాన్ పేరు కూడా ఉంటుంది. 

అయితే, తమ జెర్సీలపై పాకిస్థాన్ పేరు ఉండడాన్ని బీసీసీఐ వ్యతిరేకించింది. టీమిండియా జెర్సీలపై పాకిస్థాన్ పేరు ఉండడాన్ని తాము ఒప్పుకోబోమని స్పష్టం చేసింది. కానీ ఐసీసీ... టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టు పాకిస్థాన్ పేరు ఉన్న జెర్సీలు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇది టీమిండియాకు కూడా వర్తిస్తుందని కరాఖండీగా చెప్పింది. ఇందుకు ప్రత్యామ్నాయమే లేదని తేల్చిచెప్పింది. 

ఐసీసీ ఈ విషయంలో తన వైఖరి తేల్చిచెప్పడంతో బీసీసీఐ తన నిర్ణయం మార్చుకుంది. పాకిస్థాన్ పేరు ఉన్న జెర్సీలు ధరించేందుకు తమకు అభ్యంతరం లేదని వెల్లడించింది. దీనిపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఐసీసీ నియమనిబంధనలను ఎలా ఉన్నా తాము అనుసరిస్తామని తెలిపారు. ఐసీసీ నిర్ణయాన్ని తప్పక పాటిస్తామని పేర్కొన్నారు. 

కాగా, చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుండడంతో, తాము పాకిస్థాన్ లో ఆడేది లేదని భారత్ తెగేసి చెప్పడంతో... టీమిండియా ఆడే మ్యాచ్ లను ఐసీసీ దుబాయ్ లో ఏర్పాటు చేయడం తెలిసిందే.
Team India
Pakistan
Champions Trophy 2025
BCCI
ICC

More Telugu News