Danam Nagender: అధికారుల వల్ల చెడ్డపేరు వస్తోంది... ప్రజల మధ్య తిరగలేకపోతున్నాం: దానం నాగేందర్

Danam Nagender fires on GHMC officials
  • ఆపరేషన్ రూప్ పేరుతో ఫుట్ పాత్ లపై ఆక్రమణలను తొలగిస్తున్న అధికారులు
  • పేదల జీవనాధారాలను ధ్వంసం చేస్తున్నారని దానం మండిపాటు
  • ఫుట్ పాత్ ల విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దనేదే తన ఉద్దేశమని వ్యాఖ్య
హైదరాబాద్ లో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పేదల జీవనాధారాలను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. 

అధికారులు చేస్తున్న పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని... ప్రజల మధ్య తాము తిరగలేకపోతున్నామని దానం చెప్పారు. అధికారులు తామే సుప్రీం అనుకుంటున్నారని... వారికి పూర్తి అధికారాలు ఇస్తే ప్రభుత్వాలకు మనుగడ ఉండదని అన్నారు. కూల్చివేతలు మొదలుపెట్టాలంటే ఓల్డ్ సిటీ నుంచి మొదలుపెట్టాలని చెప్పారు.

చెరువులను కాపాడటానికి హైడ్రా చేస్తున్న పనిని తాము స్వాగతిస్తున్నామని... మూసీ నదిని ప్రక్షాళన చేయాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని చెప్పారు. ప్రజలకు అన్యాయం జరిగితే అడ్డుకోవడానికి తాను ముందుంటానని తెలిపారు. ఫుట్ పాత్ ల విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దనేదే తన అభిప్రాయం అని చెప్పారు. ఫుట్ పాత్ పై కుమారి ఆంటీని అధికారులు వేధించినప్పుడు ఆమె జోలికి వెళ్లవద్దని సీఎం ఆదేశించారని... ఇప్పుడు ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేతలపై కూడా అలాంటి ఆదేశాలే ఇవ్వాలని కోరారు.

ఖైరతాబాద్, చింతలబస్తీలో దశాబ్దాలుగా షాపులు, హోటల్స్ పెట్టుకుని బతుకుతున్నారని, వారి షాపులను ఆపరేషన్ రూప్ పేరుతో కూల్చివేస్తే ఎలాగని ప్రశ్నించారు. ఆపరేషన్ రూప్ ను ముందు ఓల్డ్ సిటీలో అమలు చేయాలని అన్నారు. 
Danam Nagender
Congress

More Telugu News