Nata Pratha: ఘోరాతి ఘోరం.. అక్కడి సంతలో యువతులు, మహిళలను అద్దెకు ఇస్తారు!

Women sold like commodities in Madhya Pradesh Dhadicha market
  • మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో అద్దెకు మహిళలు
  • మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ధడీచా పేరుతో సంత నిర్వహణ
  • మహిళలను అద్దెకు తీసుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా పురుషులు
  • రూ. 15 వేల నుంచి అద్దె మొదలై రూ. లక్షల వరకు
  • ఒప్పందాన్ని మహిళ ఎప్పుడైనా రద్దు చేసుకునేలా బాండ్ పేపర్లు
  • జాతీయ మానవ హక్కుల సంఘం ఆగ్రహం
మన దేశంలోని పలు రాష్ట్రాల్లో మహిళలు అద్దెకు దొరుకుతారన్న విషయం మీకు తెలుసా? మనకు నచ్చిన వారిని కొంతకాలానికి అద్దెకు తీసుకోవచ్చు. ఆపై వారిని తిరిగి వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహారమంతా చాలా పకడ్బందీగా జరుగుతుంది. స్టాంప్ పేపర్లపై అగ్రిమెంట్ వంటి తతంగం కూడా ఉంటుంది. ఇందుకోసం ప్రత్యక్షంగా సంత నిర్వహించడం మరో విశేషం. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ధడీచా పేరుతో ఈ సంత నిర్వహిస్తారు. ప్రతి ఏడాది నిర్ణీత సమయంలో జరిగే ఈ సంతలో యువతులు, మహిళలను అద్దెకు తీసుకోవచ్చు. ఈ సంతకు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. నచ్చిన అమ్మాయిని నెలలు, సంవత్సరాల చొప్పున అద్దెకు తీసుకుంటారు. 

రూ. 15 వేలతో మొదలు
ఇక్కడికి వచ్చే వారు రూ. 15 వేలతో మొదలుపెట్టి లక్షల అద్దె చెల్లించేందుకు సిద్ధపడతారు. కన్యలకు మరింత ఎక్కువ ధర పలుకుతుంది. అయితే, ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించే హక్కు ఆ మహిళలకు ఉంటుంది. అద్దెకు వెళ్లిన ఇంట్లో తనకు ఇబ్బందులు ఎదురైనా, అసౌకర్యంగా అనిపించినా, ఇంకే కారణంతోనైనా ఆమె తన ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. ఒప్పందంలో ఈ విషయాన్ని స్పష్టంగా రాస్తారు. పెళ్లికి తగిన యువతి దొరకని వారు, ఇంట్లోని వయోవృద్ధుల సంరక్షణ కోసం కూడా మహిళలను ఇలా అద్దెకు తీసుకుంటారు. ఇలాంటి ఆచారమే రాజస్థాన్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లోని కొన్ని సామాజిక వర్గాల్లో ఉంది. రాజస్థాన్‌లో దీనిని ‘నటప్రత’ అని పిలుస్తారు. 

మానవహక్కుల సంఘం సీరియస్
‘నటప్రత’పై ఇటీవల తరచూ మీడియాలో వార్తలు వస్తుండటంతో జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది. ఇదెక్కడి ఆచారమంటూ విస్తుపోయింది. దీనిని అరికట్టే చర్యలు చేపట్టాలంటూ కేంద్ర మహిళా, శిశు సంరక్షణ శాఖతోపాటు ఆ నాలుగు రాష్ట్రాలను కోరింది. గతంలో దీనిపై రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుంచి ఫిర్యాదులు కూడా అందాయి. తన కుమార్తెను కిడ్నాప్ చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో పలు సంచలన విషయాలు బయటపడటంతో ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ ఆచారం మహిళను కించపరిచేలా ఉందని, దీనిని రద్దు చేయాలని కోరింది. 
Nata Pratha
Rajasthan
Uttar Pradesh
Madhya Pradesh
Gujarat
Dhadicha

More Telugu News