Dil Raju: వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సాధారణం.. ఐటీ దాడులపై దిల్ రాజు

Dil Raju Press Meet About IT Raids In His Home and Office
  • నాలుగు రోజుల పాటు అధికారుల సోదాలు
  • ఐటీ రెయిడ్స్ పై మీడియాతో మాట్లాడిన ప్రొడ్యూసర్
  • అధికారులు వచ్చినపుడు తమ వద్ద రూ.20 లక్షలు ఉన్నాయని వెల్లడి
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో, ఆఫీసుల్లో నాలుగు రోజుల పాటు ఐటీ రెయిడ్స్ జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులపై నిర్మాత దిల్ రాజు శనివారం మీడియాతో మాట్లాడారు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ రెయిడ్స్ జరగడం సాధారణమేనని వివరణ ఇచ్చారు. తనతో పాటు సినీ, వ్యాపార ప్రముఖులపైనా సోదాలు జరిగాయని దిల్ రాజు గుర్తుచేశారు. తమ సంస్థలపై 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెయిడ్స్ జరిగాయని వివరించారు. ఆదాయపన్ను శాఖ వారు రొటీన్ గా రెయిడ్స్ జరుపుతుంటారని చెప్పారు.

తమ సంస్థలకు సంబంధించిన అకౌంట్స్ బుక్స్ చూసి ఐటీ అధికారులే ఆశ్చర్యపోయారని, అకౌంట్స్ అన్నీ క్లియర్ గా ఉన్నాయని చెప్పారన్నారు. అధికారులు వచ్చినపుడు తన ఇంట్లో, ఆఫీసుల్లో మొత్తం రూ.20 లక్షల లోపు నగదు ఉందని చెప్పారు. ఐటీ దాడులు జరుగుతున్నపుడు ఇంట్లో నుంచి ఎవరినీ బయటకు వెళ్లనివ్వరని గుర్తుచేశారు. తన నివాసంపై, ఆఫీసులో జరిగిన ఐటీ దాడుల విషయంలో పుకార్లు ప్రచారం చేయొద్దని మీడియాకు దిల్ రాజు విజ్ఞప్తి చేశారు.

ఐటీ దాడులతో తన తల్లికి గుండెపోటు వచ్చిందని ప్రచారం జరిగిందని మీడియాలో ప్రసారం చేశారని విమర్శించారు. తన తల్లి వయసు 81 ఏళ్లని, ఈ నెల 19న (ఐటీ సోదాలు జరుగుతున్న రోజు) ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుని ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు.
Dil Raju
IT Raids
Producer
Press Meet

More Telugu News