Team Pakistan: అత్యంత చెత్తగా ముగిసిన పాకిస్థాన్ డబ్ల్యూటీసీ ప్రయాణం!

Pakistan finish at the bottom of the 2023 and 25 ICC WTC points table
  • డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అట్టడుగున పాకిస్థాన్ జట్టు
  • డబ్ల్యూటీసీలో ఆ జట్టుకు ఇదే అత్యంత చెత్త ప్రదర్శన
  • జాబితాలో అగ్రస్థానంలో సౌతాఫ్రికా, రెండో స్థానంలో ఆసీస్
ప్రపంచ టెస్టు చాంపియన్ ‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో పాకిస్థాన్ జట్టు ప్రయాణం అత్యంత చెత్తగా ముగిసింది. ముల్తాన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో పాక్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో విండీస్ 120 పరుగుల తేడాతో గెలిచి 34 ఏళ్ల తర్వాత తొలిసారి పాక్ గడ్డపై విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. కరీబియన్ జట్టు చివరిసారి నవంబర్, 1990లో ఫైసలాబాద్‌లో జరిగిన టెస్టులో విజయం సాధించింది. ఆ తర్వాత 1997, 2006లో ఓటమి చవిచూసింది. 

ఈ ఓటమితో పాకిస్థాన్ జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. 2023/25 సైకిల్‌లో 14 టెస్టులు ఆడిన పాక్ 5 మాత్రమే గెలిచి 9 టెస్టుల్లో పరాజయం పాలైంది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 27.89 శాతం పాయింట్లతో కింది నుంచి మొదటి స్థానంలో నిలిచింది. డబ్ల్యూటీసీ సైకిల్‌లో పాకిస్థాన్‌కు ఇదే అత్యంత చెత్త ప్రదర్శన. 

డబ్ల్యూటీసీ ప్రారంభ ఎడిషన్‌లో ఆరు మ్యాచుల్లో మూడింటిలో గెలిచిన పాక్ 43.3 శాతం పాయింట్లు సాధించింది. ఆ తర్వాతి ఎడిషన్‌ (2021/23)లో నాలుగు మ్యాచుల్లో మాత్రమే గెలిచి 38.1 పాయింట్ల శాతంతో ఏడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఏకంగా అట్టడుగున నిలిచింది. ప్రస్తుతం ఈ జాబితాలో సౌతాఫ్రికా 69.44 పాయింట్ల శాతంతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా (63.73),  ఇండియా (50) వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. 
Team Pakistan
WTC
Team South Africa
Australia
Cricket News

More Telugu News