Trisha Gongadi: వెల్‌డ‌న్‌ త్రిష గొంగిడి.. యువ మ‌హిళా క్రికెట‌ర్‌కు కేటీఆర్‌, హ‌రీశ్ రావు అభినందనలు

KTR and Harish Rao Hail Trisha Gongadi Historic Feat in U19 Womens T20 World Cup
  • అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి క్రికెట‌ర్‌గా త్రిష గొంగిడి రికార్డు 
  • తెలంగాణ క్రికెట‌ర్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ పట్ల కేటీఆర్‌, హ‌రీశ్ రావు హర్షం
  • టీమిండియా మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా చూస్తామని ఆశిస్తున్నాన‌న్న కేటీఆర్
  • తర్వాతి తరానికి త్రిష రోల్ మోడల్‌గా నిలుస్తుందన్న హ‌రీశ్ రావు
అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి మహిళగా తెలంగాణ అమ్మాయి త్రిష గొంగిడి రికార్డు సృష్టించిన విష‌యం తెలిసిందే. త్రిష అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ పట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌, హ‌రీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. అండర్‌ 19 మహిళల ప్రపంచకప్‌లో అద్భుతమైన ఫీట్‌ సాధించిందని కొనియాడారు. దేశ గౌరవాన్ని పెంచడంతో పాటు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో మార్మోగేలా చేశావని ప్రశంసించారు. భ‌విష్య‌త్‌లో టీమిండియా మహిళా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్‌గా చూస్తామని ఆశిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.

త్రిష త‌ర్వాతి త‌రానికి ఆద‌ర్శం: హ‌రీశ్ రావు
మూడు కీలక వికెట్లతో పాటు 110 పరుగులతో త్రిష అద్భుతంగా రాణించింద‌ని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశంసించారు. ఆమె అద్భుత‌ ప్రదర్శన అంద‌రినీ గర్వ‌ప‌డేలా చేసింద‌ని పేర్కొన్నారు. ఔత్సాహిక మహిళా క్రికెటర్లకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. తర్వాతి తరానికి త్రిష రోల్ మోడల్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.

కాగా, గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష.. మలేసియాలో జరుగుతున్న అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం స్కాట్లాండ్‌తో జరిగిన సూపర్‌ సిక్స్‌ పోరులో త్రిష 59 బంతుల్లోనే అజేయంగా 110 ప‌రుగులు చేసింది. ఇందులో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 53 బంతుల్లోనే సెంచ‌రీ బాదిన త్రిష‌ ఈ టోర్నీ చ‌రిత్ర‌లోనే మొట్టమొదటి శ‌త‌కం చేసిన క్రికెటర్‌గా రికార్డుకెక్కింది.
Trisha Gongadi
KTR
Harish Rao
Telangana
U19 Womens T20 World Cup
Cricket

More Telugu News